సాక్షి, కడప : మేము సైతం అంటూ సమైక్యాంధ్ర ఉద్యమంలో భిన్నవర్గాల ప్రజలు పాలుపంచుకుంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై కన్నెర్ర చేస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. సమైక్యాంధ్ర అవసరాన్ని చాటిచెబుతూ పోరుబాట పడుతూనే ఉన్నారు. వాడవాడలా నినదిస్తూ పలుచోట్ల సభల పేరిట గర్జిస్తున్నారు. వేర్వేరు రూపాల్లో తమదైన పంథాల్లో పోరాటాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.
కడప నగరంలో ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఏడురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినాదాలతో హోరెత్తించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షలు 50వ రోజుకు చేరుకున్న సందర్బంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద 50 మంది ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. నీటిపారుదల, వాణిజ్యపన్నుల శాఖ, పంచాయతీరాజ్, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
జమ్మలమడుగులో రెడ్ల సంఘం ఆధ్వర్యంలో 150 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మాలమహానాడు కార్యకర్తలు రథయాత్ర చేపట్టారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సంఘీభావాన్ని తెలిపారు. ఆర్టీపీపీ మెయింటెన్స్ కార్మికులు, ఎర్రగుంట్లలో రెండవ వార్డుకు చెందిన ప్రజలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఆర్‌జేడీ రామాంజనేయులు సంఘీభావం తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ఆరోగ్య సిబ్బంది, న్యాయవాదులు, వైద్యులు,మున్సిపల్ సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలులో రాజకీయపార్టీలన్నీ ఒకే గొడుగు కిందికి రావాలని ఉపాధ్యాయులు వినూత్న నిరసన చేపట్టారు. పార్టీ అధ్యక్షుల మాస్క్‌లు ధరించిన ఉపాధ్యాయులకు సేవ్ ఆంధ్ర అని మహిళా ఉపాధ్యాయులు రాఖీలు కట్టారు. ఆర్టీసీ, రెవెన్యూ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కలసపాడులో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పోరుమామిళ్లలో విద్యార్థులు ర్యాలీ, మానవహారం చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మను నడిరోడ్డుపై పడుకోబెట్టి రంపంతో కోస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. బి.కోడూరుమండలం తుమ్మళ్లపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, మాజీ సర్పంచ్ శేషారెడ్డి ఆధ్వర్యంలో 13 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేటలో వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 230 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సోదరులు ఆకేపాటి అనిల్, మురళీరెడ్డిలతోపాటు పోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు. తాళ్లపాక, సిద్దలపల్లె, చెర్లోపల్లె గ్రామాలకు చెందిన రైతులు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 140మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటిలో న్యాయవాదులు, టీడీపీ మైనార్టీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు.
రైల్వేకోడూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి అన్ని శాఖల అధికారులు, సర్పంచులు సంఘీభావం తెలిపారు. పట్టణంలో వినూత్నంగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
మైదుకూరులో రజకులు ఒంటెద్దు బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. నడిరోడ్డుపైనే చాకిరేవు నిర్వహించారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేసి చెక్కభజన కార్యక్రమాన్ని చేపట్టారు. న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి.
పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడ్డారు. మోకాళ్లపై నడిచి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఉద్యమం ఉధృతం
Published Wed, Oct 2 2013 2:37 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement
Advertisement