సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం నేటికి 50 రోజులు పూర్తి | united andhra movements successfully completed 50 days | Sakshi
Sakshi News home page

సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం నేటికి 50 రోజులు పూర్తి

Published Wed, Sep 18 2013 12:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

united andhra movements successfully completed 50 days


 సాక్షి, రాజమండ్రి :
 సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి బుధవారం నాటికి 50 రోజులు పూర్తవుతోంది. అయినా ఎక్కడా ఉద్యమ సెగ తగ్గలేదు. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేశారు. రాజమండ్రిలో ఇంటర్ బోర్డు పరిధిలోని అధ్యాపకులు గూడ్సు గేటు సెంటర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. సమ్మెలోకి మంగళవారం ప్రభుత్వ ఎయిడెడ్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు చేరినట్టు ఆ వర్గాలు ప్రకటించాయి. యూటీఎఫ్ నగర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మెయిన్‌రోడ్డులో ప్రదర్శన చేశారు. మోరంపూడిలో యూటీఎఫ్ దీక్షలను ఎంపీడీఓ ఎస్. సుభాషిణి ప్రారంభించారు. మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి నోట్లో పాల పీకలతో నిరసన తెలిపారు.
 
  కాకినాడలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరంలో కె.గంగవరం మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ప్రదర్శనలు చేశారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెప్పారు. మామిడికుదురులో 216 జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రోడ్డుపై డప్పులు వాయించారు. ఏలేశ్వరంలో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. రాష్ట్రాన్ని విభజించ వద్దంటూ రాసిన కార్డులను సోనియాగాంధీకి పోస్టు చేశారు. ముందుగా బాలాజీ చౌక్ వద్ద కార్డులు ప్రదర్శిస్తూ రాస్తారోకో చేశారు. మండపేట కలువపువ్వు సెంటర్‌లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. రావులపాలెంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులతో ర్యాలీ చేసి కళా వెంకటరావు సెంటర్‌లో బస్సుల హారం నిర్వహించారు.
 
 విద్యార్థుల సమైక్య రాగం
 విద్యార్థులు ఉద్యమానికి కొత్త రూపు తెస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇన్నీసుపేటలో మానవహారంగా ఏర్పడ్డారు. కాకినాడ అచ్చంపేట సెంటర్‌లో ఏయూ క్యాంపస్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. సర్పవరం పోలీస్‌స్టేషన్ ఎదురుగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భారతమాత వేషాలు వేసి రాష్ట్రం విడిపోకూడదనే సందేశాలు ఇస్తూ నృత్య ప్రదర్శనలు చేశారు. కాకినాడ - యానాం రోడ్డులో తూరంగి వద్ద ఎంఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కోనసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కోనసీమలో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. రామచంద్రపురంలో విద్యార్థులు ర్యాలీ చేశారు.
 
 ప్రైవేట్ ఆస్పత్రుల బంద్
 రాజమండ్రిలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ పాటించాయి. డాక్టర్లు, సిబ్బంది మెయిన్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ చేసి, డాక్టర్లు, సిబ్బంది ప్రదర్శన చేశారు. అమలాపురంలో కూడా నర్సింగ్ హోంలు మూసివేశారు. కొత్తపేట పాత బస్టాండు సెంటర్‌లో ప్రైవేట్ వైద్యులు రోడ్డుపై సేవలు అందించారు. ఏలేశ్వరంలో వైద్య సిబ్బంది భారతదేశ పటం ఆకారంలో నిలబడి సమైక్య నినాదాలు చేశారు.
 
 కాకినాడలో సమైక్య సెగలు
 కాకినాడ మెయిన్‌రోడ్డులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. మహిళలు కూడా నిరసన గళం వినిపించారు. 300 అడుగుల జాతీయజెండాను ప్రదర్శించారు. ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద పిఠాపురం, రాజమండ్రి, అమలాపురం ప్రాజెక్టుల పరిధిలోని సిబ్బంది దీక్షలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్లు నగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జేఏసీ దీక్షల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు మెడలో ఆంధ్రప్రదేశ్ పటాలు వేసుకుని నిరసన తెలిపారు. జోర్గాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ వద్ద గిటార్లు వాయిస్తూ ప్రదర్శన చేపట్టారు. రమణయ్యపేటలో వాణిజ్య పన్నుల కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్లు తుడిచి, రాస్తారోకో నిర్వహించారు.
 
 కోనసీమలో..
 అమలాపురంలో ఆర్టీసీ కార్మికులు, వైద్యులు ర్యాలీ నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్‌లో కొనసాగుతున్న 46వ రోజు రిలే దీక్షల్లో తెలగ, బలిజ కాపు కులాల సంఘం డివిజన్ అధ్యక్షుడు కలువకొలను తాతాజీ ఆధ్వర్యంలో 220 మంది రిలే దీక్షలు చేపట్టారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి హైస్కూల్ గ్రౌండ్‌లో మండలంలోని ప్రభుత్వ శాఖల జేఏసీ అధికారులు సభ నిర్వహించారు. ఉద్యమం ఉద్ధృతికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఓడలరేవు ఓఎన్జీసీ ప్లాంటు వద్ద వాహనాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాగునీటి ట్యాంకర్లను మాత్రమే అనుమతించారు. ముమ్మిడివరంలో రైతులు రాస్తారోకో చేశారు. ముమ్మిడివరం నుంచి మురమళ్ల వరకూ ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వరరావు ఉభయ గోదావరి జిల్లాల్లో చేపట్ట తలపెట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం రాజోలు చేరుకుంది. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై మానవహారంగా ఏర్పడ్డారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో రాష్ట్ర విభజనపై ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహించారు.
 
 సమైక్య సింహగర్జన
 జగ్గంపేటలో మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో సుమారు అయిదు వేల మందితో సమైక్య సింహగర్జన నిర్వహించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ చేశారు. 500 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. ద్రాక్షారామలో జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్‌లో పాస్టర్స్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు.
 
 సమైక్య గణపతి ప్రసాదం పంపిణీ
 రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద ఏర్పాటు చేసిన సమైక్య గణపతి నవరాత్రి ఉత్సవాల వద్ద ఉంచిన 7200 కిలోల లడ్డూను భక్తులకు సమైక్యాంధ్ర నినాదాలతో పంపిణీ చేశారు. ఏపీఎన్జీవోలు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. ఎన్జీవో హోం నుంచి పుష్కరాల రేవు, మెయిన్‌రోడ్డు మీదుగా ర్యాలీ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద వంటావార్పు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 49వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కడియంలో ఏపీఎన్జీవోలు మోటారు బైక్ ర్యాలీ చేసి వేమగిరి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
 
 మంత్రుల సోనియా భజన
 పెద్దాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య వాదులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రుల మాస్క్‌లు ధరించి తహసీల్‌దారు కార్యాలయం వద్ద రోడ్ షో నిర్వహించారు. వాయిద్య పరికరాలతో భజన చేసి మంత్రులు సోనియా భజన చేస్తున్నారంటూ విమర్శించారు. సామర్లకోటలో ఫొటో స్టూడియోల నిర్వాహకులు బైక్ ర్యాలీ చేసి జేఏసీ శిబిరంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద, గొల్ల అప్పారావు సెంటర్‌లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో రోడ్డుపై ఇస్త్రీ చేస్తూ నిరసన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement