‘సార్వత్రిక’... సన్నద్ధం..!
జిల్లాను ఎన్నికల ‘కళ’ ఆవరించింది. నిన్న మున్సి‘పోల్స్’ బెల్ మోగగా, ఇప్పుడు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు ఢంకా మోగింది. దీనితో అటు రాజకీయ పక్షాల్లోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ ఊపిరి బిగపెట్టి రంగంలోకి దిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏకధాటిన ఓ అరవై రోజులపాటు అంతా అ‘టెన్షన్’తో పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జిల్లా అధికారులు సమీక్షలు , సమావేశాలతో ఇప్పటికే బిజీ అయితే...నేతలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార అంకం తదితర వాటికి నడుం కడుతున్నారు. ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్ : 16వ లోక్‌సభ, 14వ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఏప్రిల్ 30న జిల్లాలో పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
జిల్లా జనాభాలో 67.1శాతం అనగా 28.43 లక్షల మంది ఓటర్లు సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారం నుంచే జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది. జనవరి 31వ తేదీన సవరించిన ఓటరు జాబితాను ప్రచురించారు. పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు తదితరాల గుర్తింపుపైనా కసరత్తు పూర్తి చేశారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఈవీఎంల తనిఖీ, అధికారులు, సిబ్బంది గుర్తింపు, శిక్షణ వంటి అంశాలపై అధికారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పరచడాన్ని అడ్డుకోవడం, అభ్యర్థుల వ్యయం,శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
సుమారు 1200 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రతీ నియోజకవర్గానికి నాలుగు వంతున ఫైయింగ్ స్క్వాడ్, తనిఖీ బృందాలు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ధనం, మద్యం ప్రవాహాన్ని అరికట్టడం లక్ష్యంగా 22 సరిహద్దు చెక్‌పోస్టులు, 16 అంతర్గత చెక్‌పోస్టులు 24 గంటలూ పనిచేస్తాయి. నియోజకవర్గం, జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేసేలా వివిధ స్థాయిల్లోనూ ఉన్న సిబ్బందికి బాధ్యతలు