
సాక్షి, అమరావతి: ‘చేయి చేయి కలుపుదాం.. అవినీతి భూతాన్ని తరిమేద్దాం’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. 14400 కాల్ సెంటర్ ప్రారంభించి 24 గంటలు గడవక ముందే రికార్డు స్థాయిలో 5,100 కాల్స్ వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు అందిన వాటిల్లో 283 ఫిర్యాదులను నేరుగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కార్యాలయాలకు పంపించారు. ఫిర్యాదుల్లో గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖల్లో సిబ్బంది లంచం కోసం డిమాండ్ చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని అత్యధిక ఫిర్యాదులు అందడం గమనార్హం. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిరంతరం విధుల్లో కాల్‌సెంటర్ సిబ్బంది
అవినీతిని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కాల్ సెంటర్ నుంచి ఏసీబీకి ఫిర్యాదులు పంపడం, చర్యలు చేపట్టడం అంతా పక్కాగా జరుగుతోంది. 14400కి వచ్చే కాల్స్‌ను ఆర్టీజీఎస్ సిబ్బంది స్వీకరిస్తారు. కాల్ సెంటర్‌లో 20 నుంచి 25 మంది సిబ్బంది రాత్రిపగలు (24 గంటలు) షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కాల్స్‌ను రికార్డు చేస్తారు. దీన్ని కంప్యూటర్ ద్వారా వర్డ్ ఫైల్ (డాక్యుమెంటేషన్) రూపొందిస్తారు. బాధితుడి వాయిస్ రికార్డు, కాల్ సెంటర్ డాక్యుమెంట్ కలిపి జిల్లా, రేంజ్, రాష్ట్ర ఏసీబీ అధికారులకు పంపిస్తారు.
ఫిర్యాదులకు మరికొన్ని మార్గాలు
–అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు 14400 కాల్ సెంటర్‌తోపాటు ఏసీబీ ద్వారా మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా నెలకు సగటున 300కిపైగా ఫిర్యాదులు ఏసీబీకి అందుతుంటాయి. – వాట్సాప్ నంబర్ 8333995858 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
– కేంద్ర ప్రభుత్వ పరిధిలోని టోల్ ఫ్రీ నెంబర్ 1064తోపాటు ట్విట్టర్, ఈ మెయిల్, ఫేస్‌బుక్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు
ప్రజల్లో చైతన్యానికి నిదర్శనం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన 14400 కాల్ సెంటర్‌కు అందే ఫోన్ కాల్స్ ప్రజా చైతన్యానికి అద్దం పడుతున్నాయి. అవినీతిని రూపుమాపాలన్న మహాయజ్ఞంలో ప్రజలు భాగస్వాములు కావడం మంచి పరిణామం. దీనివల్ల ఏసీబీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. వ్యయ ప్రయాసలు ఉండవు. నేరుగా ఒక్క ఫోన్‌కాల్ చేసి సమాచారం ఇస్తే చాలు. ఫిర్యాదుదారుడి వివరాలు రహస్యంగా ఉంచుతాం. లంచం అడుగుతున్నారంటూ అందే ఫిర్యాదులపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల, ఇతర కీలక కేసులపై 30 రోజుల్లోగా చర్యలు చేపడతాం.
– కుమార్ విశ్వజిత్ (ఏసీబీ డీజీ)
Comments
Please login to add a commentAdd a comment