వేగంగా ఏసీబీ కేసుల దర్యాప్తు | Investigation of ACB cases rapidly | Sakshi
Sakshi News home page

వేగంగా ఏసీబీ కేసుల దర్యాప్తు

Published Mon, Jul 22 2019 3:13 AM | Last Updated on Mon, Jul 22 2019 3:13 AM

Investigation of ACB cases rapidly - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులను ఏళ్ల తరబడి నాన్చకుండా వీలైనంత త్వరగా చట్టప్రకారం చర్యలు తీసుకునేలా ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఆ కేసులపై దృష్టిపెట్టింది. గత నెల 24, 25 తేదీల్లో ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్లు, ఐపీఎస్‌లతో సమావేశం సందర్భంగా ఐపీఎస్‌లతో శాంతిభద్రతలపై సమీక్షించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఏసీబీ కేసుల పురోగతిపై కూడా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ఈ నెల 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నిర్వహించిన సమావేశంలో ఏసీబీ కేసుల పురోగతిపై ఆరా తీశారు.

రాష్ట్రంలో ఏసీబీ కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం, కుప్పలుగా పేరుకుపోయిన ఏసీబీ కేసుల్లో చార్జిషీటు, దర్యాప్తు, విచారణ దశలకు చేరకపోవడం వంటి వైఫల్యాలను చర్చించారు. ఏసీబీలో 31 కీలక కేసుల్లో 27 కేసులపై శాఖాపరంగా కూడా కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించారు. ఈ కేసుల పురోగతికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 31వ తేదీలోగా నివేదించాలని ఏసీబీ అధికారులకు గడువు విధించారు. గతంలో ఏసీబీ కేసుల నమోదులో కక్షసాధింపు చర్యలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అవినీతి నిర్మూలనకు నిష్పక్షపాతంగా అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏసీబీ కేసులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. 

ఏసీబీ కేసుల పురోగతికి కీలక నిర్ణయాలు...
ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కితే ఆ ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు, కేసు దర్యాప్తు, విచారణ వంటి ప్రక్రియలు వేగవంతం చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏసీబీ కేసుల్లో పట్టుబడిన ఉద్యోగి చిన్న స్థాయి అవినీతికి పాల్పడితే మూడు నెలలు, పెద్ద స్థాయి అవినీతి అయితే ఆరు నెలల వరకు సస్పెండ్‌ చేయాలి. ఏసీబీ కేసుల్లో పారదర్శకత కోసం కేసు నమోదు నుంచి చివరి వరకు అన్ని వివరాలను ప్రస్తావించాలి. ఈ కేసుల్లో ఎటువంటి గందరగోళానికి తావులేకుండా క్రమశిక్షణ చర్యలు ఉండాలి. అవినీతి ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో సందిగ్ధత వస్తే అవసరమైతే సదరు ఉద్యోగి పనితీరుపై విజిలెన్స్‌ నివేదిక కూడా తీసుకుంటే కేసు దర్యాప్తునకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏసీబీ కేసుల దర్యాప్తులో ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి పూర్తి వివరాలు తెప్పించుకోవాలి. అవినీతికి పాల్పడిన వారి విషయంలో కచ్చితమైన సమాచారం సేకరించడం, విజిలెన్స్, ఇంటెలిజెన్స్‌ నుంచి వివరాలు సేకరించేందుకు ఒక ప్రత్యేక ప్యానల్‌ను ఉపయోగించుకుంటే కేసు బలంగా ఉంటుంది. రిటైర్డ్‌ ఉద్యోగులపై అవినీతి కేసుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే పెన్షన్‌ నిబంధనలు రూల్‌–9ను సవరించాల్సి ఉంది.

అవినీతి కేసులో చిక్కిన ఉద్యోగి రిటైర్‌ అయిన తరువాత నేర నిరూపణ జరిగితే చట్టపరమైన చర్యల్లో భాగంగా అతని పెన్షన్‌ను పూర్తిగా (నూరు శాతం) తొలగించాలంటే ఏపీపీఎస్‌సీని సంప్రదించాలి. నేర నిరూపణతో శిక్షలు పడిన అవినీతి అధికారులపై నెలలోపే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఏసీబీ కేసుల్లో జాప్యం జరిగినా, అలక్ష్యం వహించినా సంబంధిత దర్యాప్తు అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (డీపీటీ) చట్టం–1960 కింద ఏర్పాటు చేసిన క్రమశిక్షణ విధానాల ట్రిబ్యునల్‌ న్యాయ విభాగాన్ని సంప్రదించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఏసీబీ కేసుల్లో క్రమశిక్షణ చర్యలు, కేసుల పురోగతిపై ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేయడంతోపాటు సచివాలయ స్థాయి నుంచి పర్యవేక్షించాలి. ఏసీబీ కేసుల్లో ఫైళ్లు జాప్యం జరగకుండా సచివాలయంలోని అధికారులు, సీనియర్, జూనియర్‌ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement