కాఫీ చేదు.. రాజ్‌మా లేదు
ఈ ఏడాదీ నిరాశే
పెట్టుబడులు దక్కని వైనం
గిరిజన రైతుల ఆందోళన
విశాఖ మన్యం కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఘనత కాఫీ, రాజ్‌మా పంటలది. ఏజెన్సీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఈ పంటలు ప్రకృతి విపత్తుల కారణంగా దెబ్బతింటున్నాయి. గిరిజనుల జీవనంలో పెనుమార్పులు తీసుకు వచ్చిన ఘనత కాఫీకి దక్కగా, సంప్రదాయ పంటగా గిరిజనులు సాగు చేస్తున్న రాజ్‌మాకు ఉత్తరాదిలో మంచి గుర్తింపు ఉంది. నాలుగేళ్లుగా ఈ రెండు పంటలు కలిసిరాకపోవడంతో ఆదివాసీ రైతులు ఆందోళన చెందుతున్నారు.
గూడెంకొత్తవీధి: మన్యంలో కాఫీ సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా పెరుగుతోంది. పదేళ్ల క్రితం 10 వేల ఎకరాలకు మించని కాఫీ పంట ప్రస్తుతం లక్షా 40 వేల ఎకరాలకు పెరిగింది. రానున్న ఐదేళ్లలో దీనిని2.5 లక్షల ఎకరాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో దిగుబడులు రావడం లేదు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల రైతులు ఏటా నష్టపోతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎకరాకు 250 కిలోల వరకు కాఫీ దిగుబడులు వస్తుండగా, మన్యంలో వంద కిలోలకు మించడం లేదు. కేంద్ర కాఫీ బోర్డు సూచనలను రైతులు ఆచరించకపోవడం, కాఫీ పండ్ల సేకరణ, నిల్వ, పార్చ్‌మెంట్ కాఫీ తయారీ తదితర విషయాల్లో శాస్త్రీయ విధానాలు అనుసరించకపోవడంతో కాఫీ దిగుబడుల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
వాణిజ్య పంటపై హుద్‌హుద్ ప్రభావం
మన్యంలో వరి సాగు చేయని రైతైనా ఉంటాడేమో గానీ రాజ్‌మా పంట చేపట్టనివారు ఉండరు. జాతీయ స్థాయిలో రాజ్‌మా పంటకు విశేష ఆదరణ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో రాజ్‌మా గింజల వినియోగం అధికం. మన్యంలో ప్రస్తుతం అధికార లెక్కల ప్రకారం 40 వేల ఎకరాల్లో గిరిజన రైతులు రాజ్‌మా సాగు చేస్తున్నారు. ఇది అతి సున్నితమైన పంట. దీనికి పెద్దగా పెట్టుబడులు అవసరం లేదు. అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులు ఈ పంటను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల తుఫాన్ ప్రభావం రాజ్‌మా పంటపై పడింది. దీంతో అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతు చేతికి కనీసం విత్తనాలకు పరిపడా గింజలు రాని దుస్థితి.