అసాధారణ వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: రానున్న సాధారణ ఎన్నికలకు జిల్లాపోలీసుశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నందున ఇప్పటి నుంచే భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంత మందిని భద్రత,బందోబస్తు కోసం నియమించాలనే దానిపై అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా 5వేల మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించాలని నిర్ణయిం చా రు. ఏజెన్సీలో ఎన్నికలను పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హెలికాప్టర్ల ద్వారా గగనమార్గంలో పోరాటానికి సిద్ధమవుతోంది.
పోలింగ్‌కు రెండువారాల ముందు నుంచి రౌడీషీటర్లు,దొమ్మీ కేసుల్లోనివారిని అదుపులోనికి తీసుకుంటారు. గొడవలు,అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్న నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్‌స్టేషన్ వద్ద సాధారణ పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను మోహరించనున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో మావోయిస్టులు బ్యాలెట్‌బాక్సులు ఎత్తుకుపోవడం వంటి అనుభవాల దష్ట్యా ఈసారి ఏజెన్సీలో సుమారు 1200 మందిని వినియోగించాలని ఎస్పీ నిర్ణయించారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని ఏజెన్సీ మండలాల్లో దళసభ్యులు భారీస్థాయిలో విధ్వంసం సష్టించే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.
మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ఈసారి ఎన్నికలకు రెండు హెలికాప్టర్లు వినియోగించాలని నిర్ణయించారు. ఈమేరకు వాటిని పంపాలని ఎన్నికల కమిషన్‌కు లేఖరాశారు. ఇవి వచ్చిన వెంటనే ఏజెన్సీలోని చింతపల్లి,పాడేరు,జీకేవీధి,హుకుంపేట,డుంబ్రిగుడ,అరకు ఇలా అన్ని మండలాల్లోను వీటిద్వారా నిఘాపెంచాలని నిర్ణయించారు.
మావోయిస్టు ప్రాబల్యప్రాంతాల్లో మొదటివిడతగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో కూడా తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ మొదలు పోలింగ్ ముగిసి ఫలితాలు వెల్లడించే వరకు హెలికాప్టర్లను వాడాలని తలపోస్తున్నారు. ఈవీఎంలు ఎత్తుకుపోయే ముప్పు ఉండడంతో అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను మొహరించాలని నిర్ణయించారు.
2009 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2014 ఎన్నికలకు సున్నిత,అత్యంత సున్నిత ప్రాంతాలు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా పోలీసుశాఖ భావిస్తోంది.అయితే ఏజెన్సీలో మాత్రం మునుపెన్నడూ లేనివిధంగా భద్రత పెంచాలని నిర్ణయించింది.అందుకోసం ఇప్పటికే మన్యంలోని అన్ని పోలీసుస్టేషన్లను ఆయుధాలు,సమాచర వ్యవస్థ ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా వీటిని ఆధునికీకరించే ప్రయత్నాలు వేగిరంచేశారు.నోటిఫికేషన్‌లోగా మొత్తం ఆయుధ సంపత్తిని,సిబ్బందిని పెంచుతున్నారు.
ఎస్పీ ఆదేశాలతో కూంబింగ్‌కూడా ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది. ఎన్నికల సమయంనాటికి గ్రామాల్లోకి చొరబడకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నతస్థాయి పోలీసులను నియమించబోతున్నారు.మునుపెన్నడూలేనివిధంగా జిల్లాకు నలుగురు ఐపీఎస్ అధికారులు వివిధ హోదాల్లో ఉన్నందున ఏజెన్సీలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇద్దరు ఐపీఎస్‌ల పర్యవేక్షణలో ప్రశాంతంగా నిర్వహించేలా కసరత్తు ప్రారంభించారు.