పట్టణాభివృద్ధికి పట్టం
- ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లను సూచికగా తీసుకోవాలి
- మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి
- వ్యర్థాల సక్రమ వినియోగంపై దృష్టి
- పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధీర్‌కృష్ణ వెల్లడి
విజయవాడ : కొత్త రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సుధీర్‌కృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో స్థానిక ఉడా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు నూతనంగా ఏర్పడిన సందర్భంలో ఆయా రాష్ట్రాల్లో నూతన రాజధాని, పట్టణాల ఆధునికీరణకు చేపట్టిన చర్యలను ఆంధ్ర రాష్ట్రంలో ఒక సూచికగా తీసుకోవాల్సి ఉంటుందని సమావేశంలో ఆయన చెప్పారు.
రాష్ట్రం అభివృద్ధికి కోసం రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. భారత ప్రభుత్వ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అధికారి ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర పరిపాలనా కార్యాలయాన్ని 500 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్త రాజధాని ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను విపులీకరించారు.
వినియోగ రుసుంతో దుబారాకు చెక్
దుర్వినియోగం, దుబారాను అరికట్టేందుకు వినియోగ రుసుం వసూలు చేయాలని సుధీర్‌కృష్ణ సూచించారు. నగరపాలక సంస్థ, వివిధ మునిసిపల్, రాష్ట్రస్థాయి అధికారుల నుంచి మౌలిక సదుపాయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు, తాగునీటి సరఫరా అంశాలపై చర్చించిన ఆయన మంచినీటికి వినియోగ రుసుం వసూలు చేయాలని చెప్పారు. అప్పుడే దుర్వినియోగాన్ని అరికట్టగలుగుతామన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ విధానంలో వినియోగించుకోవడం ద్వారా పునరుత్పత్తి పద్ధతిలో ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెనాలి పట్టణంలో వంద రోజుల ప్రణాళికతో రూపొందించిన రీసైక్లింగ్ విధానాల అమలు తీరును మునిసిపల్ అధికారులు వివరించారు. వ్యర్థాల సక్రమ వినియోగ పద్ధతులపై ఈ ఏడాది జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సమావేశ వివరాలను సుధీర్‌కృష్ణ ఈ సందర్భంగా వివరించారు. రీసైక్లింగ్ విధానంలో ఎంత ఖర్చు చేస్తే ఎంత ఆదాయం సమకూరింది అనే దానిపై స్పష్టమైన లెక్కలతో ముందుకు సాగాల్సిందిగా సూచించారు.
2031కి ఉడా జనాభా కోటీ 11 లక్షలు
తెనాలి, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు చెందిన అభివృద్ధి అంశాలు, 2011 జనాభా వివరాలు, 2031 నాటికి జనాభా అంచనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా జిల్లాల అధికారులు వివరించారు. వీజీటీఎం ఉడా పరిధిలో 2031 నాటికి జనాభా కోటీ 11 లక్షలకు పెరిగే అవకాశం ఉందని ఉడా వైస్ చాన్సలర్ పి.ఉషాకుమారి తెలిపారు. పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మెట్రో రైలు ప్రతిపాదనలకు సంబంధించి రూపొందించిన నివేదికను అందించారు. గ్రేటర్ విశాఖపట్నం కమిషనర్ ఎంవీ సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ జానకి విశాఖపట్నంలోని మౌలిక సదుపాయాలు, రోడ్ల వసతి, మెట్రో రైలు సాధ్యాసాధ్యాలు ఇతర రవాణా సౌకర్యాలపై వివరాలు అందించారు.
భారత ప్రభుత్వ రవాణా ప్రత్యేక అధికారి ఎన్‌కే సిన్హా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ టి.తిమ్మారెడ్డి, చీఫ్ ఇంజనీర్ జి.కొండలరావు, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, వివిధ జిల్లాల, రాష్ట్రస్థాయి అధికారులు వై.మధుసూదనరెడ్డి, వి.పాండురంగారావు, ఎంవీఎస్ రెడ్డి, డి.వరప్రసాద్ పాల్గొన్నారు.
ఉడా అభివృద్ధికి సహకరించండి
డాక్టర్ సుధీర్‌కృష్ణను ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందించారు. ఉడా పరిధిలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఉడా అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఆయన్ని కోరారు.