=వాడింది తక్కువ.. వృథా ఎక్కువ
=ఖరీఫ్‌కు వాడకం 68 టీఎంసీలు
=సముద్రంలోకి వదిలింది 381 టీఎంసీలు
=రబీకి అనుమతిచ్చే అవకాశం
సాక్షి, విజయవాడ : జిల్లాలో ఈ ఏడాది సాగునీటి వాడకం కన్నా వృథానే ఎక్కువగా ఉంది. ఈ సీజన్ మొదట్లో డెల్టాకు ఇవ్వడానికి కూడా ప్రాజెక్టులలో నీరు లేని పరిస్థితి ఉండగా, రెండు నెలల కాలంలోనే పరిస్థితిలో మార్పు వచ్చింది. భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉండగా, నిల్వ చేయలేక సముద్రంలోకి వదిలిన నీరు ఎక్కువగా ఉంది.
ఖరీఫ్ తొలినాళ్లలో రైతన్నకు కష్టాలు...
ఈ ఏడాది ఖరీఫ్ తొలినాళ్లలో రైతన్నకు కష్టాలు తప్పలేదు. ఏటా జూన్‌లో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది జూన్ 30కి నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. సాగర్‌లో నీటిమట్టం 510 అడుగులకు పడిపోవడంతో విభజనవాదులు కోర్టును ఆశ్రయించి సాగునీటి విడుదలపై స్టే తెచ్చారు. ఈ ఏడాది స్టే అమలులో లేదు. ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా తన విచక్షణతో నీటినిృవిడుదల చేయాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం స్పందించలేదు.
నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 520 అడుగులకు పైగా ఉన్నా నీటి విడుదలలో తాత్సారం చేసింది. అదే సమయంలో కొంత వర్షాలు పడటంతో రైతన్న ఊరట చెందాడు. జూలై 30న సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈలోగా వరదలు పెద్ద ఎత్తున రావడం, ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 381 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఖరీఫ్‌లో కృష్ణాడెల్టాకు 68 టీఎంసీల నీటిని వినియోగిస్తే.. సముద్రం పాలైన నీరు 381 టీఎంసీలు ఉంది.
పూర్తికాని ‘పులిచింతల’.. అవకాశం లేని నీటి నిల్వ...
పులిచింతల ప్రాజెక్టు పూర్తికాకపోవడం వల్ల అక్కడ క్రస్ట్ లెవల్ కన్నా ఎక్కువ నీటిని నిల్వచేసే అవకాశం లేకుండా పోతోంది. దీంతో నీరంతా వృథాగా సముద్రం పాలవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 133 రోజుల ఖరీఫ్ పూర్తవగా అందులో 70 రోజులు సాగర్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా విడుదల చేయకుండానే నడిచిపోయింది. సెప్టెంబర్‌లో 17 నుంచి 24 వరకు రోజుకు లక్షా 20 వేల నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేశారు. గత వారంలో కూడా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మూడున్నర లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది.
ప్రతిరోజూ పులిచింతల నుంచి ఎనిమిదివేల క్యూసెక్కులు దిగువకు వస్తుండగా, కీసర నుంచి ఐదువేల క్యూసెక్కులు వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటివిడుదల ఆపివేయాలని జిల్లా ఇరిగేషన్ అధికారులు కోరారు. దిగువ క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పుడూ ఓవర్‌ఫ్లో ఉంటోంది. మరోవైపు వాయుగుండం కారణంగా శుక్రవారం నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నీటి అవసరం పెద్దగా ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జలాశయాలు పూర్తిస్థాయిలో ఉండటంతో రబీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
నీరంతా కడలిపాలు
Published Thu, Nov 14 2013 1:23 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement