రాజకీయాల్లోకి వస్తా: ఉసెండి
రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నానని ఉసెండి ప్రకటించాడు. గురువారం పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం మీడియా ఎదుట అతను మాట్లాడేందుకు అధికారులు అంగీకరించలేదు. డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కొనసాగుతుండగానే అతన్ని మీడియా ప్రతినిధులకు చూపించి వెంటనే ఆ హాలు నుంచి వేరొకచోటుకు తరలించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఉసెండితో మాట్లాడేందుకు ప్రయత్నించగా... కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చాడు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందని, తాను పూర్తిగా దానికి అనుకూలమని స్పష్టం చేశాడు. మావోయిస్టుపార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లొంగిపోవడం సైద్ధాంతికంగా తప్పేనని, అనారోగ్య కారణాలతోనే తాను లొంగిపోయానని చెప్పాడు.
పార్టీతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నాడు. మందుపాతరతో ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడి కాన్వాయ్‌ని పేల్చడం సరికాదని పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పాడు. పార్టీ అంగీకారం మేరకే లొంగిపోయానన్నాడు. ఇదిలా ఉండగా, ఉసెండితో పాటు లొంగిపోయిన అతని భార్య సంతోషి మార్కం ఆదివాసీ యువతి. ఆమెకన్నా ముందు 1993లో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ దళ సభ్యుడిగా పనిచేసే సమయంలో అతను మిడ్కో అనే ఆదివాసీ యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆ తరువాత రెండేళ్లపాటు పార్టీకి దూరంగా ముంబై, సూరత్‌లలో రహస్య జీవితం గడిపాడు. 1996లో ఇద్దరూ మళ్లీ పార్టీని ఆశ్రయించి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. 1997లో దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మిడ్కో చనిపోయింది.