usendi
-
ఇన్ఫార్మర్ల హత్యలపై విభేదించా: ఉసెండి
ఇన్ఫార్మర్ల పేరుతో సామాన్యులను మావోయిస్టులు హత్యలు చేయడంపై తాను విభేదించానని మాజీ మావోయిస్టు నేత గుమ్మడివెల్లి వెంకట కిషన్ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి తెలిపారు. తాను అనారోగ్య కారణాల వల్లనే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. మావోయిస్టులు పాఠశాల భవనాలను కూల్చేయడాన్ని తాను పార్టీలో తీవ్రంగా ఖండించినట్లు ఆయన తెలిపారు. కాగా, చత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడిని, కేంద్ర మంత్రి కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు జరిపిన దాడిపై ఎన్.ఐ.ఎ. అధికారులు, ఉసెండి నుంచి సమాచారం రాబడుతున్నారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన చింతల్నార్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 62వ బెటాలియన్‌కు చెందిన 76 మంది మృతికి కారణమైన మావోయిస్టుల దాడిపై సీఆర్పీఎఫ్ కూడా వివరాలు రాబడుతోంది. -
ఉసెండి కోసం క్యూ కడుతున్న దర్యాప్తు సంస్థలు
హైదరాబాద్ : ఇటీవలి లొంగిపోయిన మావోయిస్టుల కీలక నేత గుముడవెల్లి వెంకట కృష్ణప్రసాద్ (జీవీకే) అలియాస్ గుడ్సా ఉసెండిని తమకు అప్పగించాలంటూ స్టేట్ ఇంటిలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ముందు దర్యాప్తు సంస్థలు క్యూ కడుతున్నాయి. ఉసెండిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులతో పాటు ఎన్ఐఏ, సీబీఐ సంస్థలు ఎస్ఐబీని కోరాయి. అయితే ఉసెండి మాత్రం తనను దర్యాప్తు సంస్థలకు అప్పగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తాను అన్ని విషయాలు ఎస్ఐబీకి వివరించినట్లు చెబుతున్నాడు. ఉసెండి లొంగుబాటు ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఉన్న ఉసెండి లొంగుబాటుతో.. ఇక లొంగుబాట్ల పరంపర కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే వామపక్ష ఉద్యమ అనుకూలురు మాత్రం ఇదంతా పోలీసుల ఎత్తుగడేనని, లొంగిపోయింది ఉసెండి కాదని.. జీవీకే ప్రసాద్ అని అంటున్నారు. అయితే ప్రభుత్వం, వామపక్ష ఉద్యమకారుల వాదనలెలా ఉన్నా... మావోయిస్టు పార్టీలో మరో నలుగురు ఉసెండిలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుముడవెల్లి వెంకట కృష్ణప్రసాద్ వారిలో ఒకరని అంటున్నారు. -
రాజకీయాల్లోకి వస్తా: ఉసెండి
రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నానని ఉసెండి ప్రకటించాడు. గురువారం పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం మీడియా ఎదుట అతను మాట్లాడేందుకు అధికారులు అంగీకరించలేదు. డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కొనసాగుతుండగానే అతన్ని మీడియా ప్రతినిధులకు చూపించి వెంటనే ఆ హాలు నుంచి వేరొకచోటుకు తరలించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఉసెండితో మాట్లాడేందుకు ప్రయత్నించగా... కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చాడు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందని, తాను పూర్తిగా దానికి అనుకూలమని స్పష్టం చేశాడు. మావోయిస్టుపార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లొంగిపోవడం సైద్ధాంతికంగా తప్పేనని, అనారోగ్య కారణాలతోనే తాను లొంగిపోయానని చెప్పాడు. పార్టీతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నాడు. మందుపాతరతో ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడి కాన్వాయ్‌ని పేల్చడం సరికాదని పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పాడు. పార్టీ అంగీకారం మేరకే లొంగిపోయానన్నాడు. ఇదిలా ఉండగా, ఉసెండితో పాటు లొంగిపోయిన అతని భార్య సంతోషి మార్కం ఆదివాసీ యువతి. ఆమెకన్నా ముందు 1993లో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ దళ సభ్యుడిగా పనిచేసే సమయంలో అతను మిడ్కో అనే ఆదివాసీ యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆ తరువాత రెండేళ్లపాటు పార్టీకి దూరంగా ముంబై, సూరత్‌లలో రహస్య జీవితం గడిపాడు. 1996లో ఇద్దరూ మళ్లీ పార్టీని ఆశ్రయించి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. 1997లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మిడ్కో చనిపోయింది. -
మావోయిస్ట్ నేత ఉసెండి లొంగుబాటు
వరంగల్ : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి గుమ్మడవెల్లి వెంకటకృష్ణ ప్రసాద్ అలియాస్ గూడ్సా ఉసెండి లొంగిపోయాడు. భార్య రాజీతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) పోలీసులకు నిన్న రాత్రే లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఉసెండి హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అతనిపై రూ.15 లక్షల రివార్డు ఉంది. ఉసెండి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్నాడు. ఉసెండి స్వగ్రామం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి. మావోయిస్టు పార్టీలో సుఖ్‌దేవ్ పేరుతో ఎక్కువగా కొనసాగాడు. రెండేళ్ల క్రితం జరిగిన మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఎన్కౌంటర్ తర్వాత ఉసెండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. కాగా ఉసెండి లొంగుబాటును పోలీసులు నిర్థారించారు.