ఉసెండి కోసం క్యూ కడుతున్న దర్యాప్తు సంస్థలు
హైదరాబాద్ : ఇటీవలి లొంగిపోయిన మావోయిస్టుల కీలక నేత గుముడవెల్లి వెంకట కృష్ణప్రసాద్ (జీవీకే) అలియాస్ గుడ్సా ఉసెండిని తమకు అప్పగించాలంటూ స్టేట్ ఇంటిలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) ముందు దర్యాప్తు సంస్థలు క్యూ కడుతున్నాయి. ఉసెండిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు ఎన్ఐఏ, సీబీఐ సంస్థలు ఎస్‌ఐబీని కోరాయి. అయితే ఉసెండి మాత్రం తనను దర్యాప్తు సంస్థలకు అప్పగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తాను అన్ని విషయాలు ఎస్ఐబీకి వివరించినట్లు చెబుతున్నాడు.
ఉసెండి లొంగుబాటు ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఉన్న ఉసెండి లొంగుబాటుతో.. ఇక లొంగుబాట్ల పరంపర కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే వామపక్ష ఉద్యమ అనుకూలురు మాత్రం ఇదంతా పోలీసుల ఎత్తుగడేనని, లొంగిపోయింది ఉసెండి కాదని.. జీవీకే ప్రసాద్ అని అంటున్నారు. అయితే ప్రభుత్వం, వామపక్ష ఉద్యమకారుల వాదనలెలా ఉన్నా... మావోయిస్టు పార్టీలో మరో నలుగురు ఉసెండిలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుముడవెల్లి వెంకట కృష్ణప్రసాద్ వారిలో ఒకరని అంటున్నారు.