సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను ఒకే వేదిక మీదకు తెస్తుందని భావించిన ‘విజయ యాత్ర’ ప్రారంభానికి ముందే రద్దయినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ‘విజయ యాత్ర’ చేపట్టారు. తెలంగాణవ్యాప్తంగా సాగాల్సిన ఈ యాత్ర మెదక్ జిల్లాలో ఈ నెల 6న ప్రారంభం కావాల్సి ఉంది. పదో తేదీ వరకు వివిధ నియోజకవర్గాల్లో ‘విజయ యాత్ర’ పేరిట సభలు నిర్వహించాలని నిర్ణయించారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న వి.హనుమంతరావుకు స్వాగతం పలకడంతో పాటు జిల్లాలో ఎక్కడెక్కడ సభలు నిర్వహించే బాధ్యతను జిల్లా కాం గ్రెస్ కమిటీకి అప్పగించారు.
ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి పార్టీ నేతలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల భేటీకి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెం బ్లీకి హాజరు కావాలని భేటీలో నిర్ణయించారు. దీంతో వీహెచ్ జిల్లా పర్యటనకు వచ్చినా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఏర్పాట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా పర్యటన రద్దు చేసుకోవాల్సిందిగా వీహెచ్‌ను కోరేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు.
పట్టాలెక్కని ‘జైత్రయాత్ర’
సోనియాకు కృతజ్ఞతలు చెప్పే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గతంలోనూ జిల్లాకు ఒకటి చొప్పున ‘జైత్రయాత్ర’ పేరిట సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 22న జిల్లాలో నిర్వహించాల్సి ఉండగా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లా నేతల మధ్య సమన్వయం లోపం, జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విప్ జయప్రకాశ్‌రెడ్డి దూరం పాటిస్తుండటంతో ‘జైత్ర యాత్ర’ ఎక్కడ నిర్వహించాలో బాధ్యులకు అంతు చిక్కడం లేదు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపితేనే జైత్రయాత్ర సభ పట్టాలెక్కే సూచన కనిపిస్తోంది. అటు జైత్రయాత్ర నిర్వహించలేకపోవడం, ఇటు విజయయాత్ర రద్దు అయినట్టు సమాచారం అందడంతో కేడర్ లో నిరుత్సాహం కనిపిస్తోంది.
‘విజయ యాత్ర’కు మంగళం!
Published Sat, Jan 4 2014 12:15 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement