కుక్కా కరవకు.. జ్వరమా రాకు.. | Vaccine And Tablets Shortage in Government Hospital YSR Kadapa | Sakshi
Sakshi News home page

కుక్కా కరవకు.. జ్వరమా రాకు..

Published Fri, Apr 26 2019 1:02 PM | Last Updated on Fri, Apr 26 2019 1:02 PM

Vaccine And Tablets Shortage in Government Hospital YSR Kadapa - Sakshi

కుక్క కరిచిందా.. ‘యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌’ ఇంజెక్షన్‌ లేదు.. ప్రయివేట్‌ మందుల షాపుల్లో కొనుక్కొని వేయించుకోండి.. జ్వరం వచ్చిందా.. ‘పేరాసెట్‌మాల్‌’ మాత్రలు లేవు. దెబ్బ తగిలిందా.. కట్టు కడదామంటే దూది లేదాయే.. దూదేం ఖర్మ.. సూదికి కూడా కొరతే. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత అవుతుంది. ఏదైనా రోగమొస్తే  జిల్లాలోని ఆసుపత్రులకు వెళ్తే వినిపిస్తున్న సమాధానాలివి..  ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య విధానం గాడి తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మందులకు అరకొర నిధులను కేటాయించింది. దీంతో ఆసుపత్రులను మందుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా గ్రామీణవాసులకు సరైన వైద్యం అందడం లేదు..

కడప రూరల్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పీహెచ్‌సీ (ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు)ల్లో మందులకు కొరత ఏర్పడింది. ఆ శాఖ పరిధిలో 74 పీహెచ్‌సీలున్నాయి. అందులో 34 పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేస్తాయి. రోజుకు ఒక పీహెచ్‌సీకి 50 నుంచి 200 మందికి పైగా ఓపీ (ఔట్‌ పేషెంట్స్‌)లు వస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. వీటని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఆ మేరకు ఒక పీహెచ్‌సీకు ఏడాదికి స్ధాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు మందులకు కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఆస్పత్రికి ఏడాదికి రూ.3 లక్షలుఅనుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.75 వేల చొప్పున మందులను కొనుగోలు చేయవచ్చు. సర్జికల్‌ అవసరాలకింద ఆస్పత్రికి నాలుగు నెలలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్‌ ప్రకారమే సూది.. దూది తదితరాలను కొనుగోలు చేయాలి. సర్జికల్‌ విభాగానికి కేటాయించే నిధులు సరిపోవడం లేదని గ్రహించిన డీఎంహెచ్‌ఓ అధికారులు రూ.1.5 కోట్ల బడ్జెట్‌ కావాలని ప్రతిపాదించారు. ఈ మందులను ఆన్‌లైన్‌ ద్వారా కడప రిమ్స్‌లో ఉన్న సెంట్రల్‌ డ్రగ్స్‌ నుంచి కొనుగోలు చేయాల్సివుంటుంది.

కుక్క కాటుకు ఇచ్చే ‘యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌’ నిలుపుదల..
రాష్ట్ర ప్రభుత్వం కుక్క కాటుకు వేసే ‘యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌’ ఇంజక్షన్‌ను హైదరాబాద్‌లోని ‘ఇండి ర్యాబ్‌’ సంస్థ నుంచి తెప్పించేది. ఇప్పుడు ఆ సంస్ధ ఆ ఇంజక్షన్‌ను బ్యాన్‌ చేసింది. దీంతో ప్రభుత్వం బెంగుళూరుకు చెందిన ఫార్మాసూటికల్‌ కంపెనీతో సంప్రదింపుల జరుపుతోంది. చర్చలు ఇంకా ఇక కొలిక్కి రాలేదు. దీంతో దాదాపు గడిచిన రెండు నెలల నుంచి పీహెచ్‌సీలకు ఈ వ్యాక్సిన్‌ సరఫరా నిలిచిపోయినట్లుగా సమాచారం. కుక్క ఒక వ్యక్తిని కరిస్తే వెంటనే ఆ ఇంజక్షన్‌ను వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ను కోర్స్‌ ప్రకారం ఐదు మార్లు వేయించుకోవాలి. అవి పీహెచ్‌సీల్లో లేనందున బయట మందుల షాపులో కొని వేయించుకోవాలి. ఒక డోస్‌కు రూ.380 వరకు ఖర్చవుతుంది. అలా ఐదు మార్లు వేపించుకోవాలంటే నిరుపేదలకు ఆర్ధిక భారమవుతుంది. పైగా కుక్కకాటు బాధితుల సంఖ్య రోజూ పెరుగుతోంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కుక్కకాటు బాధితులెందరో. ఈ ఇంజక్షన్‌కు పీహెచ్‌సీల్లోనే కాక దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత ఏర్పడింది. మిగతా ఆస్పత్రుల్లో కూడా ఇతర  మందులకు కొరత వెంటాడుతోంది.

ఇతర మందులకూ కొరతే..
పీహెచ్‌సీలకు ఇటీవల కాలంలో రోగుల సంఖ్య పెరిగింది. ఉదాహరణకు గాలివీడు, సుండుపల్లె, సురభి  తదితర పీహెచ్‌సీల్లో 200 వరకు ఓపీ కేసులు వస్తుంటా యి.  ఇలాంటి ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో మందులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. అంటే రోగుల సంఖ్య పెరిగినప్పటికీ అనుగుణంగా మందుల బడ్జెట్‌ మాత్రం పెరగలేదు. దీంతో రోగులు ఎక్కువగా వచ్చే పీహెచ్‌సీల్లో  ఈ సమస్య మరింతగా ఏర్పడుతోంది. మూడు నెలల పాటు రావలసిన మందులు రెండు నెలలకు మాత్రమే అయిపోతున్నాయి. తాజాగా జ్వరానికి వాడే ‘పేరాసెట్‌మాల్‌’ మాత్రలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి.  చాలామందిని ఘగర్, బీపీ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. వీటి బారిన గ్రామీ ణులు కూడ పడుతున్నారు. జీవితాంతం మందులు వాడుతూ, వ్యాధులను అదుపులో ఉంచుకోవాలి. పీహెచ్‌సీల్లో ఈ వ్యాధులకు ఒక దానికి రెండు రకాల మందులు మాత్రమే దొరుకుతున్నాయి. సాధారణంగా ఈ జబ్బులకు గురైన వారికి ఘగర్, బీపీ లెవల్స్‌ ప్రకారం మోతాదును బట్టి మందులను ఇవ్వాలి. అదీ కాంబినేషన్‌తో కూడిన మందులు ఇస్తేనే వ్యాధులు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా చాలా వాటిల్లో గర్భిణుల రక్తహీనత నివారణకు ఇచ్చే ‘ఐరన్‌ సిక్రోజ్‌’ మందులకు కూడా కొరత ఏర్పడింది. ఈ పరిస్ధితి పీహెచ్‌సీల్లోనే కాకుం డా దాదాపుగా మిగతా ఆస్పత్రుల్లోనూ కొరత ఏర్పడింది. సకాలంలో మందులు అందడం లేదని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. గత్యంతరం లేక ‘మందులు రాసిస్తాం.. బయట కొనండి’ అని వారు రోగులకు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement