ముందు వచ్చిన ఎమ్మెల్యేలకే వెంకన్న దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు బుధవారం తిరుమలలో వెల్లడించారు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే మంత్రులు, ఎంపీలు, ఇతర వీఐపీలకు గదులు కేటాయించినట్లు తెలిపారు. అయితే వెంకన్నను దర్శించుకునేందుకు మొదట వచ్చే ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎంబీసీ, కౌస్తభం, టీబీ సెంటర్ కేంద్రాలను మూసివేస్తన్నట్లు చెప్పారు. కానీ సామాన్య భక్తుల కోసం సీఆర్ఓ కేంద్రం మాత్రం తెరచి ఉంటుందన్నారు. వారికి అక్కడ గదులు దొరకకపోతే షెల్టర్స్లో సదుపాయం కల్పిస్తామన్నారు. జనవరి 2వ తేదీ ద్వాదశి రోజు దర్శనం కోసం ఆన్లైన్లో 10 వేల టికెట్లు విక్రయానికి పెట్టినట్లు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం వచ్చింది. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తులు,వీఐపీలు శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తిరుమలకు వస్తారు. దాంతో వారికి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.