వన జాతరకు నేతలు వస్తారా?!
- సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు రాకపై అనుమానాలు
- ఢిల్లీలో కేసీఆర్ బిజీబిజీ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వచ్చే అవకాశం
వరంగల్/హన్మకొండ, న్యూస్‌లైన్ : మహాజాతరకు ప్రధాన పార్టీ నాయకుల రాక అనుమానంగా మారింది. ముఖ్యమంత్రి ఎవరున్నా జాతరకు ముందుగానే మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లిం చే సంప్రదాయం ఉంది. గత జాతరకు వారం రోజుల ముందుగానే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి తల్లులకు బంగారం(బెల్లం), చీరలు, పసుపు,కుంకుమ సమర్పించి వెళ్లారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితులతో సీఎం రాక అనుమానంగానే ఉంది.
అధికార పార్టీ నేతలతోపాటు ప్రతిపక్ష, విపక్ష పార్టీల నేతలు సై తం ముఖం చాటేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు జాతరకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాత్రం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి దీనికి ముఖ్య కారణంగా భావిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సెగ, రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నం దున నేతలంతా దానిపైనే దృష్టి కేంద్రీకరించారు.
అలాగే పార్లమెంట్, అసెంబ్లీలో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలున్నందున నేతలంతా వీటికి హాజరుకావాల్సి ఉన్న విషయం తెలి సిందే. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చ ఇరుప్రాం తాల నేతల మధ్య విభేదాలను తీవ్రం చేసింది. సీఎం ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దీక్ష చేయడాన్ని తెలంగాణ ప్రజ లు జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా సీఎం స్థాయి నేతలు జాతరకు ముందుగానీ, జాతర సమయంలోగానీ రావడం ఆనవాయితీ.
ఇక వచ్చే జాతరను తెలంగాణలోనే జరుపుకుంటామంటూ ఇంతకాలం విశ్వాసం ప్రకటిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాతే ఆయన మేడారానికి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక టీజేఏసీ నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ ముందుగానే తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నా రు.
ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ప్రజాప్రతినిధులను జాతరకు ఆహ్వానించడంతో వారు జాతర ముగిసేలోపు ఒక్కసారి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క జాతర తొలిరోజు నుంచి మేడారంలోనే మకాం వేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే జాతరకు వచ్చి వెళ్లారు. ఏమైనా జాతరలో ఈసారి ప్రధాన నేతల సందడి లేనట్లేనని అనుకుంటున్నారు. అనూహ్యంగా పర్యటిస్తే తప్ప ఇప్పటి వర కు ఎవరి పర్యటనలు ఖరారు కాలేదు.