Mahajatara
-
మేడారం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, వరంగల్/తాడ్వాయి: మహాజాతరకు ముందే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం భక్తుల తాకిడి పెరగడంతో మేడారం సందడిగా మారింది. ఈ ఒక్కరోజు దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా భక్తులు దేవతలను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈసారి జాతరకు ముందు నెల రోజుల నుంచే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. 16 నుంచి జాతర మహాజాతర ఉత్సవాలు ఈ నెల 16న బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 16న (బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. 17న (గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపై కొలువుదీరనుంది. 18న (శుక్రవారం) భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 19న (శనివారం) సమ్మక్క ,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. కాగా, సమ్మక్క–సారలమ్మల పూజారులు అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. దేవాదాయ శాఖ అధ్వర్యంలో పూజారులకు కావాల్సిన పూజ సామగ్రి, దుస్తులు అందించారు. భక్తుల తాకిడి.. ట్రాఫిక్ జామ్ భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు ముందస్తుగా శనివారం నుంచే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగి హన్మకొండ–మేడారంకు వెళ్లే రహదారి పస్రా, తాడ్వాయి, నార్లాపూర్ మార్గాల్లో పలుచోట్ల ట్రాఫిక్ జామైంది. తాడ్వాయి–మేడారం మధ్య గంటల తరబడి వాహనాలు నిలిచి భక్తులు ఇబ్బందిపడ్డారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మేడారం సందర్శనలో ఉండటం, మరోవైపు మేడారం బస్ డిపో ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు రావడంతో పోలీసు బలగాలను అక్కడ మోహరించాల్సి వచ్చింది. పోలీసులు అప్రమత్తమై ఎక్కకికక్కడ వాహనాలను పార్కింగ్ స్థలాల్లోకి మళ్లించి నియంత్రణ చర్యలు చేపట్టారు. మేడారం రూట్‌మ్యాప్ మేడారం జాతరకు అంతా సిద్ధమైంది. 16 నుంచి ప్రజలు తరలివచ్చి సమ్మక్క, సారక్క గద్దెలను దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఎలా వెళ్లాలి.. ఎలా రావాలి.. ట్రాఫిక్ ఆంక్షలు ఏంటి.. వాహనాల పార్కింగ్ ఎక్కడ.. లాంటి సందేహాల నివృత్తికి రూట్‌మ్యాప్ -
వన జాతరకు నేతలు వస్తారా?!
సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు రాకపై అనుమానాలు ఢిల్లీలో కేసీఆర్ బిజీబిజీ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వచ్చే అవకాశం వరంగల్/హన్మకొండ, న్యూస్‌లైన్ : మహాజాతరకు ప్రధాన పార్టీ నాయకుల రాక అనుమానంగా మారింది. ముఖ్యమంత్రి ఎవరున్నా జాతరకు ముందుగానే మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లిం చే సంప్రదాయం ఉంది. గత జాతరకు వారం రోజుల ముందుగానే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి తల్లులకు బంగారం(బెల్లం), చీరలు, పసుపు,కుంకుమ సమర్పించి వెళ్లారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితులతో సీఎం రాక అనుమానంగానే ఉంది. అధికార పార్టీ నేతలతోపాటు ప్రతిపక్ష, విపక్ష పార్టీల నేతలు సై తం ముఖం చాటేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు జాతరకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాత్రం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి దీనికి ముఖ్య కారణంగా భావిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సెగ, రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నం దున నేతలంతా దానిపైనే దృష్టి కేంద్రీకరించారు. అలాగే పార్లమెంట్, అసెంబ్లీలో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలున్నందున నేతలంతా వీటికి హాజరుకావాల్సి ఉన్న విషయం తెలి సిందే. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చ ఇరుప్రాం తాల నేతల మధ్య విభేదాలను తీవ్రం చేసింది. సీఎం ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దీక్ష చేయడాన్ని తెలంగాణ ప్రజ లు జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా సీఎం స్థాయి నేతలు జాతరకు ముందుగానీ, జాతర సమయంలోగానీ రావడం ఆనవాయితీ. ఇక వచ్చే జాతరను తెలంగాణలోనే జరుపుకుంటామంటూ ఇంతకాలం విశ్వాసం ప్రకటిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాతే ఆయన మేడారానికి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక టీజేఏసీ నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ ముందుగానే తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నా రు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ప్రజాప్రతినిధులను జాతరకు ఆహ్వానించడంతో వారు జాతర ముగిసేలోపు ఒక్కసారి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క జాతర తొలిరోజు నుంచి మేడారంలోనే మకాం వేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే జాతరకు వచ్చి వెళ్లారు. ఏమైనా జాతరలో ఈసారి ప్రధాన నేతల సందడి లేనట్లేనని అనుకుంటున్నారు. అనూహ్యంగా పర్యటిస్తే తప్ప ఇప్పటి వర కు ఎవరి పర్యటనలు ఖరారు కాలేదు. -
మహా ఏర్పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహాజాతరలో కోటి మంది భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇప్పటికే 25లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. మేడారం ఏర్పాట్లపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు రద్దీ ఎంత ఉన్నా ప్రతీ భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రోడ్లు వెడల్పు చేయడం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీకి తగ్గట్లు విస్తరణ పనులు చేసినట్లు తెలిపారు. దర్శనం తర్వాత బయటకు వచ్చేందుకు రెండు దారులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులకు అమ్మవార్ల ప్రసాదం అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే మార్గంలో ప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక సిబ్బంది సుమారు 40 వరకు కౌంటర్ల ద్వారా ప్రసాదం అందిస్తారన్నారు. క్యూలైన్లలో నిలబడే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జాతరలో మంచి నీటిని పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేసి అందజేస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం జాతరలో భక్తుల అవసరాలకు తగ్గట్లు టాయిటెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీటితోపాటు జనం ఎక్కువ సంఖ్యలో గుడారాలు ఏర్పరుచుకున్న చోట మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పారిశుద్ధ్యం విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలపై నజర్ జాతరలో 22 మద్యం దుకాణాల ఏర్పాటుకు అ నుమతి ఇచ్చామన్నారు. మద్యం వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచకుండా, సిండికేట్ వ్యాపారంతో ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే లెసైన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం మేడారంలోని 60 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు తెలి పారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, 104 వాహనం సంచార వైద్య సేవలు అందిస్తుందన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిషేధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ప్రత్యేక బృందాలుగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తారన్నారు. ఆటోలకు అనుమతి లేదు మేడారం వెళ్లే రహదారులు విస్తరించి ఉన్నందున వాహనాలు వేగంగా వచ్చే అవకాశం ఉం దని, అలాంటి సమయంలో ఆటోలతో ఇబ్బందులు ఎదురవుతాయని, దీంతో మంగళవారం నుంచి జాతర ముగిసే వరకు మేడారం వెళ్లేందుకు ఆటోలను అనుమతించమని వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం కూ డా ఇబ్బందికరమేనని, ఈ విషయంలో వాహనదారులే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జాతరకు సంబంధించి ప్రధానమైంది ట్రాపిక్ సమస్య అని, దానిని అదిగమించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ కోసం 24 స్థలాలు ఏర్పాటు చేశామని, అ డ్డంగా ఉన్న వాహనాలను తొలగించేందుకు నాలుగు క్రేన్లు, జేసీబీలు సిద్ధంగా ఉంచామన్నారు. డ్రైవర్లు మద్యం తాగొద్దు జాతరకు వాహనాలు తీసుకొచ్చే డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు న డపొద్దని అన్నారు. జంగాలపల్లి, పస్రాతోపాటు మరికొన్ని చోట్ల ప్రత్యేక పోలీసు గస్తీ బృందాలు బ్రీతింగ్ అనలైజర్స్తో పరీక్షలు చేస్తారని, డ్రైవర్లు తాగినట్లు గుర్తిస్తే వాహనం అక్కడే నిలిపివేస్తామని తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారికి నిద్రమత్తు తొలగించేందుకు పస్రాతోపాటు కొన్నిచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఐస్‌లో తడిపిన కాటన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. చల్లని బట్టతో కళ్లు తుడుచుకోవడం వల్ల మరో 40 కిలోమీటర్ల వరకు నిద్రమత్తు రాకుండా ఉంటుందని అన్నారు. ఇది ఈసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
మహాజాతరకు మరో రూ. 21 కోట్లు
= ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు =‘సాక్షి’ కథనానికి స్పందించిన రాష్ట్ర సర్కారు సాక్షి ప్రతినిధి, వరంగల్ : మేడారం మహా జాతరకు మరిన్ని నిధులిచ్చేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడిగినన్ని నిధులు ఇవ్వకుండా... సమ్మక్క-సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వ్యవహారాన్ని ఇటీవలే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరంగల్ జిల్లా యంత్రాంగం విభాగాల వారీగా మొత్తం రూ. 114 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే... కేవలం రూ. 68 కోట్లు విదిలించి నిధులు కోత పెట్టింది. ఎట్టకేలకు స్పందించిన సర్కారు ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు కేటాయించేందుకు క్లి యరెన్స్ ఇచ్చింది. ఆర్ అండ్ బీ విభాగం పం పిన ప్రతిపాదనలకు ఈ నిధులను వాడుకునేం దుకు సమ్మతించింది. ప్రస్తుతం ఫెనాన్స్ విభాగంలో ఉన్న ఈ ఫైలుకు మరో రెండు రోజుల్లో ఆమోదం లభిస్తుందని ఆర్ అండ్ బీ అధికారు లు సూచనప్రాయంగా వెల్లడించారు. జాతరకు వెళ్లే మార్గాల్లో రోడ్లు, మరమ్మతులు, వంతెనల నిర్మాణానికి రూ. 53.01కోట్లు కావాలని ముందు గా ఆర్అండ్బీ విభాగం ప్రతిపాదనలు పం పించింది. అందులో రూ. 21.15 కోట్లు ఇచ్చేందు కు మాత్రమే సమ్మతించిన సర్కారు ఇప్పుడు అదనంగా రూ.21కోట్లు కేటాయించేందుకు ఫైలు కదిపింది. దీంతో భక్తులకు అనుగుణంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.