టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచన చేస్తోందని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు ఆరోపించారు.
ఆనందపేట(గుంటూరు): టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచన చేస్తోందని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయనందు కు నిరసనగా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ‘టీడీపీ ప్రజావంచన దినం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం నుంచి హిందూ కళాశాల సెంటర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
రాస్తారోకో నిర్వహించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మ్యానిఫెస్టో పత్రాలను కాంగ్రెస్‌పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా రైతులను, మహిళలను వంచన చేస్తున్నారని విమర్శించారు. బాబు వస్తే జాబు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిధులను పట్టిసీమకు తరలించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ వహీద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యతిరేక ప్రభుత్వమన్నారు. మాజీ శాసనసభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు చదలవాడ జయరాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సవరం రోహిత్, దొంత సురేష్, కరీముల్లా, ముత్యాలు, ఈరి రాజశేఖర్, బిట్రగుంట మల్లిక, మొగలి శివప్రసాద్, ఉస్మాన్, రెహమాన్, షేక్ హనీఫ్, ఎర్రబాబు, పవన్‌తేజ, చిలకా రమేష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.