స్మృతివనం ప్రధాన ద్వారం
పూర్వం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలతో కొన్ని జీవులు, నదులు, వృక్షాలను పూజించడంతో అవి ఎంతో పవిత్రతను సంతరించుకున్నాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో దేవతా వృక్షాలు, మొక్కలు గురించి వివరించారు. వాటి ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు వివరించేందుకు నల్లకాల్వ సమీపంలోని వైఎస్‌ఆర్ స్మృతివనంలో పవిత్ర వనం, నక్షత్ర వనాలు ఏర్పాటు చేశారు. అరుదైన వృక్షజాతులను కాపాడుతున్నారు.
సీతమ్మ సేదదీరిన అశోక వృక్షం..
శ్రీరాముడి పత్ని సీతను అపహరించిన రావణాసురుడు లంకలోని అశోకవనంలో నిర్భందించిన సమయంలో జీవవైవిధ్యానికి ప్రతిరూపమైన అశోకవనంలో అశోక వృక్షం కిందనే సేదదీరారు. ఈ వృక్షాన్నే సరాక్ అశోకంగా కూడా చెబుతారు. ఈ అరుదై వృక్షం భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఉందని ఇంతవరకు అనుకునే వారు. కాని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమలలో కూడా కనిపిస్తోంది. ఈ వృక్షాన్ని వైఎస్‌ఆర్ స్మృతివనంలోని పవిత్రవనంలో నాటి పెంచి పోషించడం స్మృతివనంలో ఆధ్యాత్మిక ప్రశాంతతకు సూచికగా చెప్పుకో వచ్చు.
ఆఫ్రికా మహావృక్షం.. చెంతనే వీక్షణం
ఆఫ్రికా ఖండంలోని పలు అరణ్యాలలో కనిపించే భారీ వృక్షం అడెన్ సోనియా. దీనిని ఏనుగు చెట్టు అని కూడా అంటారు. వరపగ్గం తిరిగే వలయం ఉన్న ఈ చెట్టు ఆఫ్రికాలో 2500 ఏళ్లకు పైగానే జీవిస్తుందని నిర్ధారణ అయ్యింది. ఈ వృక్షాలు మన దేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఎవరో ఎపుడో తెచ్చినాటిన ఈ వృక్షాలు జిల్లాలోని గార్గేయ పురం వద్ద కూడా ఉన్నాయి. వాటిలోని ఒక వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో తీసుకు వచ్చి వైఎస్‌ఆర్ స్మృతివనంలో పునఃప్రతిష్టించారు.
అశోక చెట్టు, ఆఫ్రీకన్ భారీ వృక్షం(అడెన్ సోనియా)
సర్వమత వృక్షాలు..
వైఎస్‌ఆర్ స్మృతివనాన్ని బహుళ అభిరుచుల ఆలవాలంగా నెలకొల్పేందుకు నిర్మాణ కర్తలు కొన్ని కచ్చితమైన మార్గ దర్శనాలను అనుసరించారు. అందులో ఆధ్యాత్మిక ప్రశాంతత ఒకటి. జీవవైవిధ్యంతో పాటు హిందూ, క్రిష్టయన్, ఇస్లాం మత గ్రంథాల్లో , ప్రవచనాల్లో, పురాణాల్లో కనిపించిన, ప్రస్తావించిన మొక్కలను, వృక్షాలను చాలా మటుకు పవిత్ర వనంలో చేర్చారు. అందులో మహాశివుడి కళ్ల నుంచి పుట్టిందని చెప్పబడే రుద్రాక్ష, అమరకోశంలో ప్రస్తావించ బడిన పొగడ, మత్స్య పురాణంలో చెప్పబడిన శతావరి, మహాభారత, వాయు, వరాహ, వామన పురాణాలలో మహాభారత ఇతిహాసంలో కనపడే పారిజాతంతో పాటు ముస్లింలు దంతావధానానికి వినియోగించే మిష్వాక్, క్రిస్‌మస్ ట్రీకి పాకించే పిల్లి తీగల వంటి అనేక పౌరాణిక సంబంధ వృక్షజాతులను వైఎస్‌ఆర్ స్మృతివనంలోని పవిత్రవనంలో ఉంచారు.
రుద్రాక్ష వృక్షం, ఎర్రచందన వృక్షం
జన్మ నక్షత్రం.. వృక్ష సంబంధం
ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మనక్షత్రం ఉండి తీరుతుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన వృక్షాలను వైఎస్‌ఆర్ స్మృతివనంలో ఒక చోట చేర్చి దాన్ని నక్షత్రవనంగా నామకరణం చేశారు. తమ జన్మ నక్షత్రానికి అనుసంధానమైన వృక్షం కింద యోగా చేసుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు ఎందరో ఇక్కడికి వస్తుంటారు. ఇవే కాకుండా ఆరు రాశులకు, సప్తరుషులకు, నవగ్రహాలకు కూడా ప్రత్యేక అనుసంధాన మొక్కలు వృక్షాలు, మొక్కలు వైఎస్‌ఆర్ స్మృతివనంలో ఉన్నాయి. స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ విషయాలు తెలుసుకుని కాసేపు ఇక్కడ సేద తీరి మానసిక ప్రశాంతతను పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment