ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రుల అసమర్ధత వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సోమవారం వర్సిటీలో నిరసన ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జునుడి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహారదీక్షలు చేశారు. ఈ దీక్షలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాష్ట్ర విభజన బిల్లు వచ్చినపుడు తాము వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు.
సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోరుతూ సీమాంధ్రలో 110 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే, కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పదవులకోసం పాకులాడడం నీచమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ జి.రోశయ్య, ఆచార్య పి.వరప్రసాదమూర్తి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జాన్సన్, ఉద్యోగ జేఏసీ నాయకులు కోడూరి కనకరాజు, కన్యాకుమారి, యుగంధర్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, ఏఎన్‌యూ జేఏసీ అధ్యక్షుడు కె. కిషోర్, బి.ఆశిరత్నం, పి.శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షలకు పలువురు సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మద్దతు పలికారు. దీక్షలను సాయంత్రం ఎమ్మెల్సీ కేఎస్. లక్ష్మణరావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
సీమాంధ్ర మంత్రుల వల్లే దుస్థితి
Published Tue, Nov 19 2013 2:12 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement