'టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు'
హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు టీడీపీ తిలోదకాలిచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గంటూరు జిల్లాలో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలను పెడచెవిన పెడుతూ లెక్కలేనట్టుగా టీడీపీ వ్యవహరిస్తొందని ఆమె ధ్వజమెత్తారు. ఈ రకమైన ధోరణి సరికాదని, దీన్ని అందరూ ఖండించాలన్నారు.
అసలు ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతో అధికార టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఏవిధమైన విలువలను ఖతారు చేయకుండా దాడుల సంస్కృతి కొనసాగిస్తోందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించకతప్పదని ఆమె హెచ్చరించారు. స్థానిక సంస్థలను ఎన్నికలను కూడా స్వేచ్ఛాయుతంగా జరిపించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ దాడులను చంద్రబాబు ఎందుకు ఖండించలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన తప్ప శరణ్యం లేదనే పరిస్థితిని కల్పించారన్నారు. అంబటిపై దాడి దుర్మార్గ చర్య అని, ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని వాసిరెడ్డి పద్మ కోరారు.