
చంద్రబాబు గర్జనలు దేనికి?: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తానంటున్న ప్రజాగర్జనలు దేనికోసమో స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గర్జించనున్నారా లేక సాధ్యమైనంత తొందరగా విభజించాలని గర్జిస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో దివంగత ఎన్టీఆర్ గర్జన పేరుతో సభలు జరిపారంటే దానికి ఒక అర్థం, అర్హత ఉంది. కానీ ఈరోజు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా చంద్రబాబు గర్జన పేరుతో పిల్లికూతలు తప్ప చేయగలిగేదేం ఉండదు’’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 75 శాతం మంది కలిసుండాలని కోరుకుంటున్నా, ఢిల్లీలో సోనియాగాంధీ తెలుగు ప్రజలపై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు బాబు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రపతి వద్దకు ఇరుప్రాంత నేతలను పంపుతారే తప్ప బాబు ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. ఈ గిమ్మిక్కుల నేపథ్యంలో ప్రతి టీడీపీ కార్యకర్త్తా బాబుపై గర్జించాలని విజ్ఞప్తి చేశారు.
ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోతుంది
పూటకో మాట, రోజుకో వేషం వేస్తున్న చంద్రబాబు తీరు చూసి ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోతుందని పద్మ వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి రోజునే ప్రెస్‌మీట్ పెట్టి స్వాగతించిన బాబు.. తదనంతరం ఎన్ని వేషాలేశారో లెక్కే లేదన్నారు. విభజన ఎలా జరగాలో చెబుతున్న బాబు.. ‘సమైక్యం’ అనే మూడు అక్షరాలు ఎందుకు పలకలేకపోతున్నారని నిలదీశారు. ‘‘అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఎక్కడ దాక్కున్నారు? అలాంటి మీరు ఈరోజు ఏముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తారు? పిల్లల ఉద్యోగాలు, సాగునీరు తదితర అంశాలపై మహిళలు, రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు? మీ కమెండోలతో కొట్టిస్తారా? లేక అడిగిన ప్రతీ ఒక్కరినీ జగన్ మనుషులంటూ ముద్రవేస్తారా? లేదంటే ప్రజల న్యాయమైన కోరికను అప్పటికైనా ఆలోచిస్తారా’’ అని పద్మ ప్రశ్నలు సంధించారు. టీఆర్‌ఎస్ పుట్టిందే చంద్రబాబు వల్ల అని సాక్షాత్తు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివే దికలో పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. బాబు చేతకానితనం వల్లే ఈదుస్థితి తలెత్తిందని, అది కాస్తా ఇప్పుడు రాష్ట్రం విడిపోవడానికి కారణమవుతోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆ తప్పుల నుంచి బయటపడేందుకు విభజనకు వ్యతిరేకంగా, సమైక్యానికి అనుకూలంగా బాబు లేఖ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.