
సాక్షి, అమరావతి: మహిళా పోలీసులు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్యభర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా అవమానించారని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే వ్యక్తి.. ఈ విధంగా మహిళలను కించపరచడం దారుణమని పేర్కొంది. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గురువారం మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ డి.మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ఎంవీఎన్ దుర్గా, గౌసియాబేగం, గీత తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు.
చదవండి: (Fact Check: ప్రాణాలు పోతున్నా టీడీపీ ప్రచార యావ.. ఈ వీడియోలే నిదర్శనం)