వ్యాట్ నంబర్ వన్: హైదరాబాద్
వ్యాట్ నంబర్ వన్: హైదరాబాద్
Published Wed, Oct 23 2013 2:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
రాష్ట్ర సొంత పన్ను సంబంధిత ఆదాయ వనరుల్లో సింహ భాగం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారానే వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.66 వేల కోట్లు కాగా అందులో 75 శాతానికి పైగా అంటే రూ.42,795 కోట్లు వ్యాట్ ద్వారానే వచ్చింది. ఇందులో 66 శాతానికి పైగా.. అంటే రూ. 28,277 కోట్లు కేవలం హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో.. జిల్లాలు, రంగాల వారీగా ఆదాయ వివరాలను సేకరించి కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సమర్పించే పనిలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యాయి.
అందులో భాగంగా 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2012-13 వరకు వ్యాట్ ద్వారా ఏ జిల్లాలో ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. ఈ వివరాలను జీవోఎంకు పంపనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్‌లో వస్తున్న వ్యాట్ ఆదాయాన్ని సీమాంధ్ర కోల్పోవాల్సి వస్తుందని, సీమాంధ్ర ప్రాంతం ఆదాయ వనరులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయాన్ని సీమాంధ్రకు కూడా పంపిణీ చేయాల్సి ఉంటుందని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement