Value Added Tax
-
పెట్రోల్‌పై రూ.3.78 పెంపు
చెన్నై : తమిళనాడులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై రూ 3.78, డీజిల్‌పై రూ 1.70 పెరిగాయి. పెట్రోల్, డిజిల్‌పై తమిళనాడు ప్రభుత్వం వ్యాట్(వ్యాల్యూ ఆడెడ్ ట్యాక్స్) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపుపై తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్రోల్, డిజిల్ ధరల పెంపుతో సామాన్యులపై తీవ్రప్రభావం పడుతుందని, తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్‌పై 27 శాతం ఉన్న వ్యాట్‌ను 34 శాతానికి పెంచగా, డీజిల్‌పై 21.4 శాతం ఉన్న వ్యాట్‌ను 25 శాతానికి పెంచారని అసోసియేషన్ ప్రెసిడెంట్ కే.పీ మురళి పేర్కొన్నారు. ధరలపెంపుతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడులో పెంచిన వ్యాట్‌తో పెట్రోల్ ధర లీటరుకు రూ. 75కు చేరింది. -
గ్యాస్ సిలిండర్‌పై వ్యాట్ తగ్గించండి
పౌరసరఫరాల శాఖ సిఫార్సు సాక్షి, హైదరాబాద్: సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్‌తో వినియోగదారుల పై అదనంగా పడుతున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) భారాన్ని తగ్గిం చేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆధార్ నంబర్‌తో అనుసంధానం అయిన విని యోగదారుల ఖాతాలో రూ.388 జమ కావాల్సి ఉన్నా, రూ.369.53 మాత్రమే జమ అవుతోంది. వ్యాట్ రూ.39.64గా ఉండడంతో రూ.18.47 మేర తక్కువగా జమ అవుతోంది. అదే ఆధార్ నమోదుచేసుకోని వారికి ప్రస్తుతం రాయితీ ద్వారా అందిస్తున్న సిలిండర్ ధర రూ.444.50 ఉండగా, అందులో వాస్తవ ధర 423.33, వ్యాట్ రూ.21.17గా ఉంది. ఇలా వ్యాట్ వ్యత్యాసం రూ.18.47 మేర ఉంది. దీంతో పౌరసరఫరాల శాఖ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భా రాన్ని తగ్గించేలా నిర్ణయం చేయాలని కోరింది. -
ఏపీ వ్యాట్ ఆదాయం రూ.25,986 కోట్లు
* 2014-15కు అధికారుల అంచనా * తెలంగాణ వ్యాట్ ఆదాయం రూ.28,514 కోట్లు * వచ్చే ఏడాదిలో ఆంధ్రాకు రూ.28,322 కోట్లు * తెలంగాణకు వ్యాట్ ద్వారా రూ.31,078 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా అధికమొత్తంలో ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వస్తు వినియోగం ఆధారంగా వ్యాట్‌తో ఏ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో అధికార యంత్రాంగం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో సైతం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చే ఆదాయూన్ని విభజించిన తర్వాత తెలంగాణకు 52 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 48 శాతం మేర ఆదాయం వస్తోంది. 2014-15లో వ్యాట్ ద్వారా ఏపీకి రూ.25,986 కోట్లు సమకూరనుండగా, తెలంగాణకు రూ.28,514 కోట్లు రానున్నారుు. అలాగే 2015-16లో వ్యాట్‌తో ఏపీకి రూ.28,322 కోట్లు రానుండగా, తెలంగాణకు రూ.31,078 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అలాగే ప్రస్తుతం, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఎక్సైజ్, రవాణా, రిజస్ట్రేషన్లు..స్టాంపులు, గనులు, అటవీ, ల్యాండ్ రెవెన్యూ రంగాల ద్వారా రెండు రాష్ట్రాలకు ఎంత ఆదాయం వస్తుందో కూడా అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం.. ప్రస్తుత పన్నుల విధానం, లెసైన్స్, పన్ను రేటుల ఆధారంగా వాణిజ్య పన్నుల ఆదాయంలో 9 శాతం మేర వృద్ధి ఉంటుది. ఎక్సైజ్ ఆదాయంలో వృద్ధి 5 శాతం మేర ఉంటుంది. స్టాంపులు..రిజిస్ట్రేషన్ల ఆదాయూనికి సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 25 శాతం మేర పెరుగుదల ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో 20 శాతం మేర, మిగిలిన జిల్లాల్లో 15 శాతం మేర పెరుగుదల ఉంటుంది. రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో పెద్ద పెరుగుదల ఉండదని, మొత్తం మీద 3 శాతం మేర మాత్రమే ఆదాయ వృద్ధి ఉంటుందని అధికారుల అంచనా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వాణిజ్య పన్నుల బకాయిలు రూ.8,500 కోట్లుగా అంచనా వేశారు. కొన్ని సంస్థలకు పన్ను రాయితీలో భాగంగా రూ.350 కోట్లను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రభుత్వాలు సంప్రదింపుల ద్వారా ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర అమ్మకం పన్ను పరిహారంగా కేంద్రం నుంచి రూ.11,277 కోట్లు రావాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదాయం పన్నుగా రూ.4,000 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ రెండు అంశాలపై కూడా రెండు ప్రభుత్వాలు సంప్రదింపులు ద్వారా ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేవిధంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పరిష్కారాలు చూపెట్టని అంశాలను రెండు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అవగాహనతో నిధుల పంపిణీని చేసుకోవాల్సి ఉంటుంది. -
ఎల్బీటీ రద్దు యోచనలో సర్కార్!
ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర స్థానిక సంస్థల పన్ను(ఎల్బీటీ)ని పూర్తిగా రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఏర్పడే లోటును విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచడం ద్వారా పూడ్చుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ముంబై మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్ట్రాయ్ను రద్దు చేస్తూ దశల వారీగా ఎల్బీటీ పన్నును విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎల్బీటీపై వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్దమొత్తంలో ఆందోళనలు చేపట్టారు. రోజుల తరబడి బంద్ పాటించి, దుకాణాలను తెరవకుండా నిరసన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఎల్బీటీని వసూలు చేసింది. 2010 నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని, వ్యాపారులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎల్బీటీని పూర్తిగా రద్దు చేసి, వ్యాట్‌ను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. పన్నుభారం నేరుగా ప్రజలపైనే... రాష్ట్రంలో వ్యాట్ అమల్లో ఉండగా ఎల్బీటీని విధించడంపై వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్థికంగా భారమైన ఈ పన్ను విధానాన్ని రద్దు చేయాలని, ఈ పన్ను విధానం వల్ల అధికారుల ఒత్తిడి తమపై పెరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. కావాలనుకుంటే వ్యాట్‌ను పెంచుకోండంటూ ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించారు. వ్యాట్‌ను పెంచడం ద్వారా సమకూరే ఆదాయాన్ని స్థానిక సంస్థలకు గ్రాంటు రూపంలో ఇవ్వాలని, తద్వారా స్థానిక సంస్థల ఆర్థిక అవసరాలకు ఎటువంటి సమస్య ఉండదంటూ పలువురి చేసిన సూచన లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇలా వ్యాట్‌ను పెంచడం ద్వారా దాని ప్రభావం నేరుగా వినియోగదారులపైనే పడే అవకాశముందని సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
జలయజ్ఞంలో 500 కోట్లు హాంఫట్
వారంతా జలయజ్ఞం కాంట్రాక్టర్లు... లెక్క ప్రకారం వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించారు. కానీ... ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ఆ మొత్తం చూస్తుండగానే తిరిగి కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా రూ.500 కోట్లు ఇలా వెనక్కు మళ్లాయి. ‘ఇదో కుంభకోణం... బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అంటూ విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా దీనిపై చర్యలు లేవు. డబ్బులు పొందిన వారిలో అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు, పలువురు నేతలకు చెందిన కంపెనీలున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయటంలో విఫలమవుతున్న కిరణ్ ప్రభుత్వం.... కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి చేకూర్చటంలో మాత్రం ఎనలేని ఉత్సాహం చూపుతోంది. ప్రభుత్వ పెద్దలు చకచకా పావులు కదిపి గుట్టుగా గూడుపుఠాణి నడుపుతున్నారు. జలయజ్ఞం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అప్పటి వాణిజ్య పన్నుల శాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో పన్ను చెల్లించారు. కానీ ఆ తర్వాత వాటిని తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా గతంలో ఎప్పుడో ఓ కేసు విషయంలో వచ్చిన కోర్టు తీర్పును ఆధారం చేసుకుని ఈ పన్నును తిరిగి పొందేందుకు ప్రభుత్వ పెద్దలతో సమాలోచనలు జరిపారు. ఓ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలున్న అధికారి ఒకరు చక్రం తిప్పారు. ఇంకేముంది.. బడా కాంట్రాక్టర్లు చెల్లించిన పన్ను తిరిగి వారి జేబుల్లోకి వెళ్లడం ప్రారంభమైంది. గడచిన రెండేళ్ల కాలంలో దశలవారీగా రూ.500 కోట్లు వారికి చేరిపోయాయి. కొన్ని కంపెనీలకు ఐదారు దఫాలుగా కూడా చెల్లించారు. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. అయితే పన్ను డబ్బులు తిరిగి పొందలేకపోయిన కొందరు కాంట్రాక్టర్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఆ విభాగం ... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా జరిగిన ఈ వ్యవ హారం అక్రమమని తేల్చి ఇదో కుంభకోణమేనంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫారసు కూడా చేసింది. ఆ నివేదిక ఆరునెలల క్రితమే అందినా ప్రభుత్వం దాన్ని తొక్కి పెట్టింది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ‘ఈ వ్యవహారం దర్యాప్తులో ఉన్నందున వివరాలు ఇవ్వలేము’ అంటూ అధికారులు దాన్ని బయటపెట్టడం లేదు. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా వసూలు చేసే టీడీఎస్‌ను... ఆ తర్వాత వారు చెల్లించాల్సిన పన్నును బేరీజు వేసుకుని, టీడీఎస్ కంటే పన్ను మొత్తం తక్కువగా ఉన్న సందర్భాల్లోనే ఇలా వెనక్కు ఇవ్వాల్సి వచ్చిందంటూ అధికారులు ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారు. వెరసి పన్ను మొత్తం వెనక్కు ఇవ్వటంలో అక్రమాలు జరగలేదని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. పన్ను మదింపులో లాఘవం ప్రదర్శించటం ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో తప్పులు జరగలేదని తే ల్చే ప్రయత్నం ఇప్పటికే మొదలైందని సమాచారం. విజిలెన్స్ విచారణ సరిగా జరగలేదని పేర్కొంటూ మరో విచారణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది మరో దారుణం..: చాలా సందర్భాల్లో వ్యాట్ చెల్లించేప్పుడు వ్యాపారులు అధికారుల వాదనతో విభేదిస్తుంటారు. పెద్దమొత్తంలో పన్ను చెల్లించాల్సిన పరిస్థితుల్లో కొందరు వాణిజ్య పన్నుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి తీర్పు వ్యతిరేకంగా వస్తే, తీర్పు వచ్చిన 180 రోజుల్లో ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేయాల్సి ఉంటుంది. గడువు దాటితే హైకోర్టు కేసును డిస్మిస్ చేస్తుంది. గత మూడునాలుగేళ్లలో 185 కేసులకు సంబంధించి ఇలా ప్రభుత్వం గడువు లోపు హైకోర్టును ఆశ్రయించటంలో విఫలమైంది. ఆలస్యంగా రావటంతో ఆ కేసులను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫలితంగా ఆ కేసులకు సంబంధించి భారీ మొత్తంలో ఆదాయాన్ని వాణిజ్య పన్నుల శాఖ కోల్పోయింది. ఈ మొత్తం దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. ఇంత దారుణమా...: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటు ప్రభుత్వం లోనివారు.. అటు కాంట్రాక్టర్లు తలచుకుంటే గుట్టు చప్పుడు కాకుండా కుంభకోణాలు జరిగిపోతాయనటానికి వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన అక్రమాలే నిదర్శనమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడింది. జలయజ్ఞం కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా రూ.500 కోట్ల పన్ను మొత్తాన్ని తిరిగి చెల్లించటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాణిజ్య పన్నుల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ సకాలంలో హైకోర్టును ఆశ్రయించకుండా దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవడం దారుణమని పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించి తాము సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా అధికారులు వివరాలు అందించటం లేదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు రావు చెలికాని, కార్యదర్శి పద్మనాభరెడ్డిలు తెలిపారు. రూ.500 కోట్ల కుంభకోణంపై పూర్తయిన విజిలెన్స్ విచారణ వివరాలను కూడా బయటకు పొక్కనీయటం లేదని ఆరోపించారు. ట్రిబ్యునల్ తీర్పుపై సకాలంలో హైకోర్టును ఆశ్రయించని కారణంగా ఐటీసీ లిమిటెడ్ అన్న సంస్థ ఒక్కటే రూ.84.33 కోట్ల లబ్ధి పొందిందంటే మిగతా కేసుల్లో ఆ మొత్తం ఎంతుంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. -
వ్యాట్ నంబర్ వన్: హైదరాబాద్
రాష్ట్ర సొంత పన్ను సంబంధిత ఆదాయ వనరుల్లో సింహ భాగం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారానే వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.66 వేల కోట్లు కాగా అందులో 75 శాతానికి పైగా అంటే రూ.42,795 కోట్లు వ్యాట్ ద్వారానే వచ్చింది. ఇందులో 66 శాతానికి పైగా.. అంటే రూ. 28,277 కోట్లు కేవలం హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో.. జిల్లాలు, రంగాల వారీగా ఆదాయ వివరాలను సేకరించి కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సమర్పించే పనిలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యాయి. అందులో భాగంగా 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2012-13 వరకు వ్యాట్ ద్వారా ఏ జిల్లాలో ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. ఈ వివరాలను జీవోఎంకు పంపనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్‌లో వస్తున్న వ్యాట్ ఆదాయాన్ని సీమాంధ్ర కోల్పోవాల్సి వస్తుందని, సీమాంధ్ర ప్రాంతం ఆదాయ వనరులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయాన్ని సీమాంధ్రకు కూడా పంపిణీ చేయాల్సి ఉంటుందని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.