ముంబై: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర స్థానిక సంస్థల పన్ను(ఎల్‌బీటీ)ని పూర్తిగా రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఏర్పడే లోటును విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచడం ద్వారా పూడ్చుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ముంబై మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్ట్రాయ్‌ను రద్దు చేస్తూ దశల వారీగా ఎల్‌బీటీ పన్నును విధిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఎల్‌బీటీపై వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్దమొత్తంలో ఆందోళనలు చేపట్టారు. రోజుల తరబడి బంద్ పాటించి, దుకాణాలను తెరవకుండా నిరసన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఎల్‌బీటీని వసూలు చేసింది. 2010 నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని, వ్యాపారులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎల్‌బీటీని పూర్తిగా రద్దు చేసి, వ్యాట్‌ను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.
పన్నుభారం నేరుగా ప్రజలపైనే...
రాష్ట్రంలో వ్యాట్ అమల్లో ఉండగా ఎల్‌బీటీని విధించడంపై వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్థికంగా భారమైన ఈ పన్ను విధానాన్ని రద్దు చేయాలని, ఈ పన్ను విధానం వల్ల అధికారుల ఒత్తిడి తమపై పెరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. కావాలనుకుంటే వ్యాట్‌ను పెంచుకోండంటూ ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించారు.
వ్యాట్‌ను పెంచడం ద్వారా సమకూరే ఆదాయాన్ని స్థానిక సంస్థలకు గ్రాంటు రూపంలో ఇవ్వాలని, తద్వారా స్థానిక సంస్థల ఆర్థిక అవసరాలకు ఎటువంటి సమస్య ఉండదంటూ పలువురి చేసిన సూచన లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇలా వ్యాట్‌ను పెంచడం ద్వారా దాని ప్రభావం నేరుగా వినియోగదారులపైనే పడే అవకాశముందని సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌బీటీ రద్దు యోచనలో సర్కార్!
Published Tue, May 13 2014 10:32 PM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement
Advertisement