తిరుపతి: గత రెండు రోజుల నుంచి భర్త, అత్తమామల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టిన వీణ కథ సుఖాంతమయ్యింది. భార్య వీణతో కాపురం చేయడానికి భర్త సమ్మతి వ్యక్తం చేయడంతో ఆమె దీక్షకు ప్రతిఫలం లభించింది. దీక్ష స్థలిలోనే ఎమ్మెల్యే సమక్షంలో భార్య భర్తలిద్దరూ మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో వారిద్దరి సమస్య ఓ కొలిక్కి వచ్చినా.. ఆమె తల్లి దండ్రులు మాత్రం ఇంకా పూర్తి న్యాయం జరగలేదని అభిప్రాయపడుతున్నారు.
అంతకుముందు భర్త హరికృష్ణ తనతో కలిసి కాపురం చేస్తానంటేనే దీక్ష విరమిస్తానని వీణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనను భర్త ఆదరించాలంటూ రెండు రోజుల క్రితం దీక్ష చేపట్టిన వీణ శుక్రవారం కూడా కొనసాగించింది. ఉదయం బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే వెంకటరమణ.. సాయంత్రానికి కల్లా సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే వీణ మామయ్య గోవిందయ్య తో చర్చలు జరిపాడు. వీణ దీక్ష చేస్తున్న వార్తలను చూసిన భర్త హరికృష్ణ కూడా ఘటనాస్థలికి చేరుకోవడంతో వారి మధ్య ఎమ్మెల్యే రాజీ కుదిర్చారు. దీంతో పాటు వీణకు అటు మీడియా, మహిళా సంఘాల మద్దతు కూడా లభించడంతో భర్త హరికృష్ణ కాపురం చేయడానికి అంగీకరించాడు.
తిరుపతి భవానీనగర్‌కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టిందని ఆమె నుంచి భర్తను దూరం చేసే యత్నం చేశారు. ఆడపిల్ల పుట్టిందని అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత భర్త హరికృష్ణ మాయం కావడం. ఆమె దీక్ష చేపట్టడంతో కలకలం సృష్టించింది.