సాక్షి, నందిగామ: కృష్ణాజిల్లాలో పలుచోట్ల పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గన్నవరం విమానాశ్రయానికి విమాన రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నందిగామ పరిసరాలను దట్టమైన పొగమంచు ఆవరించింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై పొగమంచు తెరలుతెరలుగా రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దారి కనబడక వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎండ వచ్చేవరకు వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేస్తున్నారు. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. మార్నింగ్ వాక్‌కు వెళ్లేవారు, పసిపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
గన్నవరంలోనూ..
గన్నవరం పరిసర ప్రాంతాల్లోనూ పొగమంచు ఆవరించింది. ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన స్పైస్ జెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment