
వెలగపూడి సారాజిక సేవ
- తూర్పులో సామాజిక సేవ ముసుగు
- మరోపక్క అక్రమ మద్యం వ్యాపారం
- విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
- వెలగపూడి నిర్వాకాలపై జనం కన్నెర్ర
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఒక చేత్తో మంచినీరు .. మరో చేత్తో సారా తాగిస్తున్న నాయకుడాయన. సేవ ముసుగులో మద్యం వ్యాపారం చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతగా ఎదిగారు. మద్యం సిండికేట్ గా అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తూ కుటుంబాలను విచ్చిన్నం చేస్తూ కోట్లు కూడబెట్టారు. ఆ డబ్బును ఇష్టానుసారంగా వెదజల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ హోదాతో సారా వ్యాపారాన్ని మరింత విస్తరించారు. వైన్‌షాపులు, బెల్టు షాపులు తెరిచి యువతను మద్యం మత్తులో ముంచుతున్నారు.
ఆయన ఆగడాలు శ్రుతి మించడంతో మద్యం కేసులో ఏసీబీకి దొరికిపోయారు. ఆయనే తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన వెలగపూడి ఒకవైపు సేవా కార్యక్రమాలను చేస్తూనే.. మరోవైపు మద్యం వ్యాపారాన్ని విస్తరించారు. రెండు సొంత ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఆరిలోవ, జాలారిపేట ప్రాంతాల్లో మంచినీటి సరఫరా చేస్తుంటారు.
యువకులు, సంఘాలు చేపట్టే కార్యక్రమాలకు డబ్బులు అందజేస్తుంటారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. తాను ఉచితంగా నీటిని పంపిణీ చేస్తున్న ప్రాంతాల్లోనే మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్న విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. సహాయం పేరుతో అందరికీ పంచిపెట్టిన సొమ్ము ఆయా ప్రాంతాల్లో మందుబాబుల నుంచే పిండుకుంటున్నారన్న విషయం ఏసీబీ మద్యం కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది.
సిండికేట్‌గా హవా
ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత వెలగపూడి మద్యం సిండికేట్‌గా రెచ్చిపోయారు. శ్రీషిర్డీసాయి, శ్రీవిజయ వైన్స్ పేరుతో మద్యం అమ్మకాలు చేస్తుండడంతో ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులను ఏర్పాటు చేశారు. అధిక ధరకు విక్రయి స్తూ మందుబాబుల జేబులకు చిల్లులుపెట్టారు. తనకు వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తున్న వారిపై అధికా దర్పాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే అండ చూసుకొని మద్యం వ్యాపారులు రెచ్చిపోయారు.
పెదవాల్తేరు, ఆరిలోవ, జోడుగుళ్లపాలెంలో అనధికార బెల్టుషాపులు పుట్టుకొచ్చాయి. బీచ్‌లో అనుమతులు లేకుండానే దుకాణాలు తెరిచారు. రుషికొండ ప్రాంతంలో ఏకంగా గెడ్డ భూమిని ఆక్రమించి అక్కడ దాబా నిర్మాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ ప్రయత్నం వివాదాస్పదమవడంతో వెనక్కు తగ్గారు. ఒకవైపు బెల్టుషాపులను రద్దు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటనలు గుప్పిస్తూ.. వెలగపూడి లాంటి మద్యం వ్యాపారికి పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
చంద్రబాబు ఇచ్చే హామీలకు, చేసే కార్యక్రమాలకు పొంతన ఉండదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొంటున్నారు. యువతను, కుటుంబాలను నాశనం చేస్తున్న మద్యం వ్యాపారులకు టికెట్లు ఇవ్వడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకులుఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో మందు కంటే మద్యం పారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.