
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు సోమవారం శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎటువంటి సిఫారసులు లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీకి మాత్రమే సాధ్యమయ్యిందన్నారు. నైపుణ్యం ఉన్న వాళ్లే సచివాలయ వ్యవస్థకు అవసరం అని నమ్మి పరీక్షల ద్వారా ఉద్యోగులను నియమించామని తెలిపారు.
కష్టపడి చదువుకున్న వాళ్ళే ఎదుటి వారి కష్టాలు తీర్చగలరన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంతో ఓర్పు ఉండాలని సూచించారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగాలన్నారు. ప్రస్తుతం తాత్కాలికమే అయినా, రెండు సంవత్సరాలకు సచివాలయాల ఉద్యోగాలు పర్మినెంటు అవుతాయని తెలిపారు. ఇకపై జనాలు రాష్ట్ర సెక్రటేరియట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఐదు బ్యాచ్‌లుగా ట్రైనింగ్: మల్లాది విష్ణు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఐదు బ్యాచ్‌లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బ్యాచ్‌కు రెండు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటారన్నారు. వివిధ శాఖల నుంచి రిటైర్డ్ కమిషనర్లను, మెప్మా పీడీలను ట్రైనర్లుగా నియమించామని తెలిపారు. కార్పొరేషన్ల జోనల్ కమిషనర్లను పీడీలుగా ఏర్పాటు చేశామన్నారు. సచివాలయ బాధ్యతలను వార్డు సెక్రెటరీలు అందరూ తెలుసుకోవాలన్నారు. సచివాలయ వ్యవస్థను గ్రామాలకు, పట్టణాలలోని వార్డులకు తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో నిర్ణయించారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయాలలో సెక్రెటరీలుగా అందరూ బాధ్యతగా పని చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment