
సాక్షి, విజయవాడ : విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రామలింగేశ్వర నగర్ స్క్రూబ్రిడ్జి వద్ద వంగవీటి మోహనరంగా ఉద్యానవనాన్ని, విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పార్కును తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇప్పుడు మరలా పార్కును ప్రారంభించి.. మోహన రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పేద ప్రజల కోసం రంగా చేసిన పోరాటాలు తమకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించిన వంగవీటి మోహనరంగా అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని తెలిపారు. విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు.