Vangaveeti mohanaranga
-
రంగా పేరు తలిచే అర్హత టీడీపీకి లేదు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. రంగా వెన్నులో దిగిన కత్తి, ఆయనపై విసిరిన బాంబు.. టీడీపీది కాదా.. చంద్రబాబుది కాదా.. సైకిల్ది కాదా అని ప్రశ్నించారు. రంగాను చంపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఆయన బొమ్మ పెట్టుకునే అర్హత కూడా లేదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా ప్రశ్నించారు. వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించన ఈ కార్యక్రమానికి మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి రమే‹Ùనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. రంగా వ్యక్తి కాదు ఒక శక్తి.. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదన్నారు. చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దని అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన తమకే ఉందన్నారు. రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రంగా ఒక వ్యక్తి కాదని శక్తి అని పేర్కొన్నారు. ఆయన అందరి వాడన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు రంగా అని కొనియాడారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగానే కారణమన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి రంగా ఒక ఐకాన్ అని పేర్కొన్నారు. మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం కాపులకు ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా రంగాతో కలిసి నడిచిన పది మందిని ఘనంగా సత్కరించారు. అనంతరం రంగా జీవిత చరిత్రలో కొన్ని అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎపీఎండీసీ చైర్మన్ పుణ్యశీల, వైఎస్సార్సీపీ నేతలు భవకుమార్, మహమూద్, రాధారంగా మిత్రమండలి నాయకులు చెన్నుపాటి శ్రీను పాల్గొన్నారు. -
త్వరలోనే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తాం
సాక్షి, విజయవాడ : విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రామలింగేశ్వర నగర్ స్క్రూబ్రిడ్జి వద్ద వంగవీటి మోహనరంగా ఉద్యానవనాన్ని, విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పార్కును తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇప్పుడు మరలా పార్కును ప్రారంభించి.. మోహన రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజల కోసం రంగా చేసిన పోరాటాలు తమకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించిన వంగవీటి మోహనరంగా అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని తెలిపారు. విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. -
ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు
విజయవాడ: నగరంలో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత వంగవీటి మోహనరంగా 70వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భాను నగర్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు వంగవీటి రాధ, వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కన్వీనర్ కడప రత్నాకర్, వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కోర్ టీం మెంబర్ త్రివిక్రమ భానోజిరెడ్డి పాల, పలువురు విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. వందల సంఖ్యలో కార్యక్రమానికి హాజరైన వంగవీటీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మోహనరంగాకు ఘన నివాళులు అర్పించారు. -
వంగవీటికి వందకి వంద
‘‘వంగవీటి మోహనరంగాగారు మరణించి 28 ఏళ్లయింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాలు... వాస్తవ సంఘటనలు, నిజజీవిత కథల ఆధారంగా సినిమాలు తీసే నిర్మాతలు చాలామంది ఉన్నారు. సున్నితమైన అంశాన్ని స్పృశించడం ఎందుకు? అనుకున్నారో ఏమో! 28 ఏళ్లుగా వంగవీటి కథను ఎవరూ ఎంపిక చేసుకోలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమర్థవంతంగా సినిమా తీసి మెజారిటీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాను’’ అన్నారు దాసరి కిరణ్‌కుమార్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వంగవీటి’. 1973 నుంచి 88 మధ్య విజయవాడలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 23న విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా దాసరి కిరణ్‌కుమార్ చెప్పిన విశేషాలు.... ► మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసిన చిత్రమిది. అప్పటి సంఘటనలను ప్రజల ముందుకు తీసు కెళ్లాలనే లక్ష్యంతో తీశా. ‘వంగవీటి’ అనగానే కొందరు ఆయన జీవితకథ అనుకుని, మెంటల్‌గా ప్రిపేర్ అయి థియేటర్లకు వచ్చారు. ‘‘వంగవీటి మోహనరంగా బయోపిక్ కాదిది. రాధా నుంచి రంగా హత్య వరకూ జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా’’ అని వర్మ మొదట్నుంచీ చెబుతున్నారు. ►సినిమా బాగోలేదంటే సెకండ్ షోకి జనాలు లేని పరిస్థితి. డీమానిటైజేషన్ ప్రభావం వల్ల థియేటర్లకు జనాలు వచ్చి డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. ఈ తరుణంలో విజయవాడలో 9, గుంటూరులో 7 షోలు, భీమవరంలో మిడ్నైట్ రెండింటికి షో వేశారు. ‘రంగాగారిపై ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదు’ అనడానికి ఇదే నిదర్శనం. ►‘‘సినిమా చూశాం. చాలా బాగుంది, బాగా తీశారు. రాధా, రంగాలను డీసెంట్‌గా చూపించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఓ వ్యకిగా రాధాగారిని బాగా చూపించారు. ఫస్టాఫ్‌లో రాధాగారిని చూసిన తర్వాత సెకండాఫ్‌లో రంగాగారిపై మరిన్ని సీన్లు చూపిస్తారని ఆశించాం’’ అని రంగాగారి అభిమానులు చెప్పారు. వాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే. సినిమా చూసిన తర్వాత రాధాగారి తరహాలో రంగాగారిని మరో పది నిమిషాలు చూపిస్తే బాగుంటుందనుకున్నా. ► ఓ సినిమాగా చూస్తే ‘వంగవీటి’ పర్ఫెక్ట్. వందకి వంద మార్కులు వేసుకోగలిగే సినిమా. ఈ సినిమా విడుదలకు ముందూ తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించా. వాటిని ఎదుర్కోగలననే ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఈ సినిమా తీశా. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఈ సినిమా గురించి చెప్పుకుంటారు. ►సినిమా రిలీజ్ టైమ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించిన ఏపీ పోలీస్ సిబ్బంది, డీజీపీ నండూరి సాంబశివరావుగారికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ►సంక్రాంతి తర్వాత తదుపరి సినిమా వివరాలు ప్రకటిస్తా. ప్రస్తుతం వర్మగారు అమితాబ్ బచ్చన్‌తో ‘సర్కార్–3’ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌ని ఈ నిర్మాత హ్యాండిల్ చేయగలడనే నమ్మకం ఆయనకు కలిగితే, ఏ నిర్మాతకైనా సినిమా తీసే ఛాన్స్ వస్తుందని నా భావన. ఆయన ఎప్పుడంటే అప్పుడు మళ్లీ సినిమా తీయడానికి నేను రెడీ. -
ఒప్పుకోండి!
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై పోలీసు ఒత్తిళ్లు రంగా విగ్రహ ధ్వంసం ఘటనలో అదుపులో ఐదుగురు టీడీపీకి చెందిన ఇద్దరిని వదిలేసిన వైనం మిగిలిన ముగ్గురిపై పోలీసు మార్కు విచారణ మచిలీపట్నం : మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగా విగ్రహ ధ్వంసం ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిజాంపేటకు చెందిన ఐదుగురిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో వారిని వదిలేశారు. మిగిలిన ముగ్గురు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడంతో వారిని ఇనగుదురు, మచిలీపట్నం, ఆర్‌పేట పోలీస్స్టేషన్లకు తిప్పుతూ పోలీస్ పద్ధతిలో ప్రశ్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. హోంమత్రి చినరాజప్ప, మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం నిజాంపేటలోని రంగా విగ్రహం కూల్చివేసిన ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో నిందితులను శిక్షించాలని ప్రశ్నించిన ఓ వ్యక్తిని ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడం గమనార్హం. దీంతో వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం రాత్రి మచిలీపట్నం పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నవారిని ఏ కారణంతో ప్రశ్నిస్తున్నారో తెలపాలని కోరారు. అయినా వారినుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని వారు విమర్శిస్తున్నారు. వారే ఘటనకు పాల్పడినట్లు అంగీకరించాలని ఒత్తిడి చేయడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే వాదన వినిపిస్తున్నారు. రాజకీయ కోణం దాగి ఉందా? మచిలీపట్నం పురపాలక సంఘంలో టీడీపీ అధికారంలో ఉంది. కాపు సామాజిక వర్గానికి చైర్మన్ పదవిని ఇవ్వాలనే డిమాండ్ కొంతకాలంగా కొనసాగుతోంది. దీంతో పురపాలక సంఘంలో అధికార పక్ష సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. మార్చి 31న జరిగిన పురపాలక సంఘం సమావేశానికి అధికార పార్టీకి చెందిన12 మంది కౌన్సిలర్లు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో పురపాలక సంఘంలో రాజకీయ సమీకరణలు మారుతుండటంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రంగా విగ్రహ ధ్వంసం ఘటనను తెరపైకి తెచ్చి వ్యూహాత్మకంగా విస్తృత ప్రచారం కల్పించారనే వాదన టీడీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది. మచిలీపట్నంలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరులో భాగంగానే రంగా విగ్రహ ధ్వంస రచన జరిగిందని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకొంటున్నారు. -
రంగాను పొట్టన పెట్టుకున్న టీడీపీ
* టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు దారుణ హత్య * పేదలకు కాపు కాసిన నేతను కాటేశారు వంగవీటి మోహనరంగా.. జనం సమస్యలను ముందుండి పరిష్కరించిన నేత. 1981లో జైలులో ఉండగానే కార్పొరేటర్‌గా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ ప్రభుత్వం తీసుకున్న పక్షపాత నిర్ణయాల్ని నిలదీశారు. ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. రిక్షా కార్మికుడు నర్సింహారావు లాకప్‌డెత్ నేపథ్యంలో రంగా నేతృత్వంలో వీధుల్లోకి వచ్చిన కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎగ్జిబిషన్ మైదానంలో పోలీస్ పరేడ్‌కు హాజరైన అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాదరావును కలిసి నిరసన తెలిపేందుకు వందలాది రిక్షాలతో కార్మికుల్ని వెంటబెట్టుకుని వెళ్లి రంగా ైధె ర్యంగా చేసిన పోరాట ం చూసినవారెవ్వరూ మరచిపోరు. ఆయన తీరు చూసిన వారంతా ‘పేదలకు కాపు కాసిన నిజమైన నేత రంగా..’ అని అప్పట్లో అనుకునేవారు. ఇదే సమయంలో 1985లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో టీడీపీ నేతలకు.. ముఖ్యంగా చంద్రబాబునాయుడు లాంటి వాళ్లకు ఏమాత్రం మింగుడుపడలేదు. టీడీపీ ప్రజాకంటక నిర్ణయాల్ని రంగా ఎండగట్టడంతో టీడీపీ నేతలు ఆయనను హత్య వంటి కేసుల్లో కూడా ఇరికించి జైలులో పెట్టి జనంలో లేకుండా చేశారు. 1988లో విజయవాడలో ఐదు లక్షల మందితో భారీగా కాపునాడు జరిగింది. కొద్దిరోజులకు బెయిల్‌పై విడుదలైన రంగా కోస్తా ప్రాంతంలో జనచైతన్య యాత్ర ప్రారంభించడంతో టీడీపీ అగ్రనేతలకు సైతం ముచె ్చమటలు పట్టాయి. రంగా ఎదుగుదల చూసిన చంద్రబాబునాయుడు, కోడెల శివప్రసాదరావు, దేవినేని నెహ్రూ వంటి నేతలకు వెన్నులో వణుకుపుట్టింది. రంగా ఉంటే రాజకీయంగా కష్టాలు తప్పవనే నిర్ణయానికి వారంతా వచ్చారు. రంగాకు బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి. ఉన్నత స్థాయి వారితో పాటు టీడీపీ పాలకుల నుంచి కూడా హతమారుస్తామన్న హెచ్చరికలకు భయపడి రంగా రాజీ బాట పట్టలేదు. టీడీపీ నేతలు పోలీసుల్ని ఉసిగొల్పడంతో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని టీడీపీ పాలకుల్ని కోరారు. ప్రాణాల్ని బలితీసుకుంటారన్న నిర్ణయానికి వచ్చిన రంగా గాంధేయమార్గంలో బందరు రోడ్డులోని రాఘవయ్యపార్కు వద్ద తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షలో ఉండగానే 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున అయ్యప్ప భక్తుల వేషాల్లో వచ్చిన తెలుగుతమ్ముళ్లు కత్తులతో అతి కిరాతకంగా రంగాను పొట్టనబెట్టుకున్నారు. -
గణపవరంలో వైఎస్, రంగా విగ్రహాల ఆవిష్కరణ
గణపవరం(నాదెండ్ల),న్యూస్‌లైన్: గణపవరంలోని పోలేరమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహనరంగా విగ్రహాలను వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ట, గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) బుధవారం రాత్రి ఆవిష్కరించారు. దీనికి ముందు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోని పోలేరమ్మ గుడి సెంటర్ వరకు పార్టీ నాయకులు,కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, తీన్మార్ డప్పులతో సందడి చేస్తూ భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. అనంతరం జరిగిన సభలో పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ మోహనరంగా హత్యతో అధికారంలో వచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్, వంగవీటి మోహనరంగా స్నేహానికి గుర్తుగా గణపవరంలో వారి విగ్రహాలను ఏర్పాటు చేయ టం అభినందనీయమన్నారు. కాపులను బీసీల్లో చేర్చే దమ్మున్న ఏకైక పార్టీ వైఎ స్సార్ కాంగ్రెస్ అని తెలిపారు. వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని వంచించిందని, గాంధీభవన్‌లో రంగా చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. తన తండ్రి బతికినంత కాలం పేదల పెన్నిధిగా ఉన్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా కుట్ర పన్నిప్పుడు వైఎస్ ఆదుకొని టికెట్ ఇప్పించారని గుర్తు చేశారు. గుంటూరు, కృష్ణాజిల్లాల సమన్వయ కర్త ఆర్కే మాట్లాడుతూ పేద ప్రజలకోసం పరితపించిన మహానాయకులు వైఎస్సార్, వంగవీటి రంగా అని కొనియాడారు. వారి స్పూర్తితో ప్రజాసేవలో ఉన్న వారి వారసులను ఆదరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతున్నదని తెలిపారు. జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగాకు చిలకలూరిపేటతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. రంగా అభిమానులు వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని విజ్ఙప్తి చేశారు. సభకు రిటైర్డ్ ఉపాధ్యాయడు గాలి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సభలో గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు తూర్పు సమన్వయ కర్త షేక్ షౌకత్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ నాయకులు చిన్నపురెడ్డి, బెనర్జీ, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, గ్రామపార్టీ అధ్యక్షులు కాట్రు రమేష్, పట్టణ, వివిధ మండలాల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డమస్తాన్రావు, చల్లా యజ్ఞేశ్వరరావు, చాపలమడుగు గోవర్ధన్, సర్పంచ్‌లు, వివిధ అనుబంధ సంఘాల కన్వీనర్లు పాల్గొన్నారు.