వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై పోలీసు ఒత్తిళ్లు
రంగా విగ్రహ ధ్వంసం ఘటనలో అదుపులో ఐదుగురు
టీడీపీకి చెందిన ఇద్దరిని వదిలేసిన వైనం
మిగిలిన ముగ్గురిపై పోలీసు మార్కు విచారణ
మచిలీపట్నం : మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగా విగ్రహ ధ్వంసం ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిజాంపేటకు చెందిన ఐదుగురిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో వారిని వదిలేశారు. మిగిలిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కావడంతో వారిని ఇనగుదురు, మచిలీపట్నం, ఆర్‌పేట పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ పోలీస్ పద్ధతిలో ప్రశ్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. హోంమత్రి చినరాజప్ప, మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం నిజాంపేటలోని రంగా విగ్రహం కూల్చివేసిన ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో నిందితులను శిక్షించాలని ప్రశ్నించిన ఓ వ్యక్తిని ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడం గమనార్హం. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం రాత్రి మచిలీపట్నం పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నవారిని ఏ కారణంతో ప్రశ్నిస్తున్నారో తెలపాలని కోరారు. అయినా వారినుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని వారు విమర్శిస్తున్నారు. వారే ఘటనకు పాల్పడినట్లు అంగీకరించాలని ఒత్తిడి చేయడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే వాదన వినిపిస్తున్నారు.
రాజకీయ కోణం దాగి ఉందా?
మచిలీపట్నం పురపాలక సంఘంలో టీడీపీ అధికారంలో ఉంది. కాపు సామాజిక వర్గానికి చైర్మన్ పదవిని ఇవ్వాలనే డిమాండ్ కొంతకాలంగా కొనసాగుతోంది. దీంతో పురపాలక సంఘంలో అధికార పక్ష సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. మార్చి 31న జరిగిన పురపాలక సంఘం సమావేశానికి అధికార పార్టీకి చెందిన12 మంది కౌన్సిలర్లు హాజరుకాలేదు.
ఈ నేపథ్యంలో పురపాలక సంఘంలో రాజకీయ సమీకరణలు మారుతుండటంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రంగా విగ్రహ ధ్వంసం ఘటనను తెరపైకి తెచ్చి వ్యూహాత్మకంగా విస్తృత ప్రచారం కల్పించారనే వాదన టీడీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది. మచిలీపట్నంలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరులో భాగంగానే రంగా విగ్రహ ధ్వంస రచన జరిగిందని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకొంటున్నారు.