వంగవీటికి వందకి వంద
‘‘వంగవీటి మోహనరంగాగారు మరణించి 28 ఏళ్లయింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాలు... వాస్తవ సంఘటనలు, నిజజీవిత కథల ఆధారంగా సినిమాలు తీసే నిర్మాతలు చాలామంది ఉన్నారు. సున్నితమైన అంశాన్ని స్పృశించడం ఎందుకు? అనుకున్నారో ఏమో! 28 ఏళ్లుగా వంగవీటి కథను ఎవరూ ఎంపిక చేసుకోలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమర్థవంతంగా సినిమా తీసి మెజారిటీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాను’’ అన్నారు దాసరి కిరణ్‌కుమార్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వంగవీటి’. 1973 నుంచి 88 మధ్య విజయవాడలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 23న విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా దాసరి కిరణ్‌కుమార్ చెప్పిన విశేషాలు....
► మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసిన చిత్రమిది. అప్పటి సంఘటనలను ప్రజల ముందుకు తీసు కెళ్లాలనే లక్ష్యంతో తీశా. ‘వంగవీటి’ అనగానే కొందరు ఆయన జీవితకథ అనుకుని, మెంటల్‌గా ప్రిపేర్ అయి థియేటర్లకు వచ్చారు. ‘‘వంగవీటి మోహనరంగా బయోపిక్ కాదిది. రాధా నుంచి రంగా హత్య వరకూ జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా’’ అని వర్మ మొదట్నుంచీ చెబుతున్నారు.
►సినిమా బాగోలేదంటే సెకండ్ షోకి జనాలు లేని పరిస్థితి. డీమానిటైజేషన్ ప్రభావం వల్ల థియేటర్లకు జనాలు వచ్చి డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. ఈ తరుణంలో విజయవాడలో 9, గుంటూరులో 7 షోలు, భీమవరంలో మిడ్‌నైట్ రెండింటికి షో వేశారు. ‘రంగాగారిపై ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదు’ అనడానికి ఇదే నిదర్శనం.
►‘‘సినిమా చూశాం. చాలా బాగుంది, బాగా తీశారు. రాధా, రంగాలను డీసెంట్‌గా చూపించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఓ వ్యకిగా రాధాగారిని బాగా చూపించారు. ఫస్టాఫ్‌లో రాధాగారిని చూసిన తర్వాత సెకండాఫ్‌లో రంగాగారిపై మరిన్ని సీన్లు చూపిస్తారని ఆశించాం’’ అని రంగాగారి అభిమానులు చెప్పారు. వాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే. సినిమా చూసిన తర్వాత రాధాగారి తరహాలో రంగాగారిని మరో పది నిమిషాలు చూపిస్తే బాగుంటుందనుకున్నా.
► ఓ సినిమాగా చూస్తే ‘వంగవీటి’ పర్‌ఫెక్ట్. వందకి వంద మార్కులు వేసుకోగలిగే సినిమా. ఈ సినిమా విడుదలకు ముందూ తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించా. వాటిని ఎదుర్కోగలననే ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఈ సినిమా తీశా. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఈ సినిమా గురించి చెప్పుకుంటారు.
►సినిమా రిలీజ్ టైమ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించిన ఏపీ పోలీస్ సిబ్బంది, డీజీపీ నండూరి సాంబశివరావుగారికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
►సంక్రాంతి తర్వాత తదుపరి సినిమా వివరాలు ప్రకటిస్తా. ప్రస్తుతం వర్మగారు అమితాబ్ బచ్చన్‌తో ‘సర్కార్–3’ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌ని ఈ నిర్మాత హ్యాండిల్ చేయగలడనే నమ్మకం ఆయనకు కలిగితే, ఏ నిర్మాతకైనా సినిమా తీసే ఛాన్స్ వస్తుందని నా భావన. ఆయన ఎప్పుడంటే అప్పుడు మళ్లీ సినిమా తీయడానికి నేను రెడీ.