కిరణ్‌కుమార్, రామ్‌గోపాల్ వర్మ
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’.
దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు.
దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది.
అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment