సాక్షి, దుత్తలూరు నెల్లూరు : భక్తుల కొంగు బంగారంగా.. మెట్ట ప్రాంత ఆరాధ్య దైవంగా.. పతిభక్తికి ప్రతిరూపంగా.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. అంటరానితనం నిర్మూలనకర్తగా.. వలస వాసుల వరాల తల్లిగా విరాజిల్లుతున్న నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఏటా జ్యేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి దాటిన మొదటి ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు హాజరవుతారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
వెంగమాంబ చరిత్ర
దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీ మజరా గ్రామమైన వడ్డిపాళెం వాస్తవ్యులైన పచ్చవ వెంగమనాయుడు, సాయమ్మ దంపతులకు కుల దైవమైన రేణుకాదేవి అనుగ్రహంతో వెంగమాంబ జన్మించింది. వెంగమాంబకు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన ఉండేది. వెంగమాంబకు నర్రవాడకు చెందిన వేమూరి గురవయ్యతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వివాహానంతరం భర్తకు అనుకూలంగా ఉంటూ ఆదర్శ దంపతులుగా ఉండేవారు. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడేవారు. అభాగ్యులను ఆదుకుంటూ ఆదర్శ గృహిణిగా నిలిచారు. అగ్రవర్ణాలు దళితులను మంచినీటి బావుల వద్దకు రాకూడదనే సమయంలో ఈమె నీటిని చేది దళితులకు అందించేవారు. వారి కోసం బావిని కూడా తవ్వారు.
ఇప్పటికీ ఆ బావిని వేమూరి వారి బావిగా పిలుస్తున్నారు. ఒక రోజు ఆమె భర్త గురవయ్యనాయుడు పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని అడవికి వెళ్లారు. దీన్నే దొడ్డకొండ అంటారు. అదే సమయాన వెంగమాంబ స్నేహితులతో కలిసి గడ్డికోసం అడవికి వెళ్లారు. ఇంతలో అకస్మాత్తుగా దొంగలు వచ్చి వెంగమాంబ, స్నేహితులను అటకాయించారు. దీంతో బిగ్గరగా కేకలు వేశారు. అడవిలో ఉన్న గురవయ్య ఒక్క ఉదుటున అక్కడికి చేరుకుని దొంగలతో తలపడ్డారు. దొంగలందర్నీ హతమార్చగా ఒక దొంగ చాటుగా ఈటెతో గురవయ్య గుండెకు విసిరాడు. దీంతో గురవయ్యకు తీవ్రగాయమై రక్తస్రావమై స్పృహ కోల్పోయారు. మూడు రోజుల పాటు భార్య వెంగమాంబ, గ్రామస్తులు ఎన్ని సపర్యలు చేసినా స్పృహలోకి రాలేదు.
దీంతో వెంగమాంబ తన భర్త మరణించకముందే ముత్తయిదువుగా అగ్నిగుండ ప్రవేశం చేయాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులు, గ్రామస్తులను ఒప్పించారు. నర్రవాడ గ్రామంలోని మధ్యభాగాన అందరూ చూస్తుండగానే అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆమె అగ్నిగుండ ప్రవేశం చేసిన తెల్లవారి అక్కడ వెంగమాంబ మంగళసూత్రాలు, పైటకొంగు కాలకుండా గ్రామస్తులకు కనిపించాయి. అనంతరం వెంగమాంబ తన స్నేహితురాలైన తుమ్మల పెదవెంగమ్మ, వెంగమాంబ బావగారైన ముసలయ్యనాయుడికి కల్లో కనిపించి తనకో దేవాలయాన్ని నిర్మించాలని కోరారు. అనంతరం వెంగమాంబకు దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
అమ్మ పెట్టుబడితో వ్యాపారంలో అధిక ఆదాయాలు
వెంగమాంబ పేరంటాలు దేవస్థానం తరఫున అమ్మవారి నగదును భక్తులకు అందజేస్తారు. భక్తులు రూ.100 చెల్లిస్తే అమ్మవారి నగదును చిల్లర రూపంలో రూ.80 అందజేస్తారు. ఈ నగదును వ్యాపార పెట్టుబడిలో కలపగా అధిక ఆదాయాలు వస్తాయనేది భక్తుల నమ్మకం. ఈ విధంగా అధిక ఆదాయాలు పొందిన భక్తులు అమ్మవారి దేవస్థాన ఆభివృద్ధికి తమ వంతు కానుకలను అందిస్తున్నారు. అమ్మవారి పేరుతో పలు జిల్లాలు, రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలు, హోటళ్లు నడుస్తున్నాయి.
దేవస్థానానికి చేరుకునేదిలా..
దుత్తలూరు మండలం నర్రవాడలో దేవస్థానం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నెల్లూరు నుంచి దుత్తలూరు మీదుగా పామూరు వెళ్లే మార్గంలో నర్రవాడలో దిగాలి. ఒంగోలు నుంచి కందుకూరు మీదుగా దుత్తలూరు వెళ్లే మార్గాన, కడప నుంచి బద్వేలు, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు వెళ్లే మార్గాన, పోరుమామిళ్ల నుంచి సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు మార్గాన నర్రవాడకు చేరుకోవాలి.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు
ఐదు రోజుల పాటు జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23న నిలుపు కార్యక్రమంతో ప్రారంభంకానున్నాయి. అదే రోజున సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడతారు. 24న వెంగమాంబ, గురవయ్య రథోత్సవం, సంతానం లేనివారు వరపడతారు. 25న రథోత్సవం, 26న ఉదయం వెంగమాంబ, గురవయ్య కల్యాణోత్సవం, పసుపు, కుంకుమ ఉత్స వం, రాత్రికి ప్రదానోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవాల్లో చివరి రోజైన 27న పొంగళ్లు, ఎడ్ల బండలాగుడు పందేలు, తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సారి బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజుల్లో అన్నదా న, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment