'వెల్ సబ్జెక్ట్ లేనివారే వెల్‌లోకి దూసుకెళ్తారు'
సభలో వెల్ సబ్జెక్ట్ లేని సభ్యులే వెల్లోకి దూసుకువెళ్తారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యుల రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం హైదరాబాద్లో ఐటీసీ కాకతీయ హోటల్లో ప్రారంభమైనాయి. ఎమ్మెల్యే శిక్షణ తరగతులకు వెంకయ్యనాయుడు హాజరై శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ వ్యవహార శైలి ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రస్తుత సభల్లో అవసరమైన విషయాల కంటే అనవసర విషయాలపైనే చర్చ అధికంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఎవరి మీదో కోపంతో సభలో మైకులు విరిస్తే ప్రజలకు ఏం లాభమని ప్రశ్నించారు. మీడియా కూడా వికారాన్నే అధికంగా చూపిస్తుందని తెలిపారు. అలా కాకుండా ప్రజా సమస్యలపై చర్చకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సభ జరుగుతున్న సయమంలో ప్రతిపక్షానికే ఎక్కువ అవకాశం ఇవ్వాలని వెంకయ్య అధికార పక్షానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పని దినాలు పెంచాలని వెంకయ్య ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యే శిక్షణ తరగతులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణిలు హాజరైయ్యారు.