MLA Training classes
-
'విభజనతో ఎమ్మెల్యేలకు బాధ్యత మరింత పెరిగింది'
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యత మరింత పెరిగిందని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఐటీసీ కాకతీయ హోటల్లో రెండవ రోజు జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ తరగతుల కార్యక్రమానికి సుమిత్ర మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాసన వ్యవస్థపై గౌరవం పెరిగేలా సభ్యులు వ్యవహారించాలని సూచించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారు. అలాగే వివిధ అంశాలపై చర్చ జరిగినప్పుడు ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు మంచి అవగాహనతో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తనకు పూర్తి నమ్మకం ఉందని మహాజన్ వెల్లడించారు. చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని మహాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని మహాజన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ మాజీ స్పీకర్ నజ్మా హెప్తుల్లా, ఆంధ్రప్రదేశ్ అసంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, సీఎం చంద్రబాబులు పాల్గొన్నారు. రెండు రోజులు పాటు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు శుక్రవారం హైదరాబాద్లో ఐటీసీ కాకతీయ హోటల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ శిక్షణ తరగతులు నేటితో ముగియనున్నాయి. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'వెల్ సబ్జెక్ట్ లేనివారే వెల్లోకి దూసుకెళ్తారు'
సభలో వెల్ సబ్జెక్ట్ లేని సభ్యులే వెల్లోకి దూసుకువెళ్తారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యుల రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం హైదరాబాద్లో ఐటీసీ కాకతీయ హోటల్లో ప్రారంభమైనాయి. ఎమ్మెల్యే శిక్షణ తరగతులకు వెంకయ్యనాయుడు హాజరై శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ వ్యవహార శైలి ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రస్తుత సభల్లో అవసరమైన విషయాల కంటే అనవసర విషయాలపైనే చర్చ అధికంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎవరి మీదో కోపంతో సభలో మైకులు విరిస్తే ప్రజలకు ఏం లాభమని ప్రశ్నించారు. మీడియా కూడా వికారాన్నే అధికంగా చూపిస్తుందని తెలిపారు. అలా కాకుండా ప్రజా సమస్యలపై చర్చకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సభ జరుగుతున్న సయమంలో ప్రతిపక్షానికే ఎక్కువ అవకాశం ఇవ్వాలని వెంకయ్య అధికార పక్షానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పని దినాలు పెంచాలని వెంకయ్య ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యే శిక్షణ తరగతులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణిలు హాజరైయ్యారు.