'విభజనతో ఎమ్మెల్యేలకు బాధ్యత మరింత పెరిగింది'
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యత మరింత పెరిగిందని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఐటీసీ కాకతీయ హోటల్లో రెండవ రోజు జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ తరగతుల కార్యక్రమానికి సుమిత్ర మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాసన వ్యవస్థపై గౌరవం పెరిగేలా సభ్యులు వ్యవహారించాలని సూచించారు.
సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారు. అలాగే వివిధ అంశాలపై చర్చ జరిగినప్పుడు ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు మంచి అవగాహనతో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తనకు పూర్తి నమ్మకం ఉందని మహాజన్ వెల్లడించారు. చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని మహాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని మహాజన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో లోక్సభ మాజీ స్పీకర్ నజ్మా హెప్తుల్లా, ఆంధ్రప్రదేశ్ అసంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, సీఎం చంద్రబాబులు పాల్గొన్నారు. రెండు రోజులు పాటు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు శుక్రవారం హైదరాబాద్లో ఐటీసీ కాకతీయ హోటల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ శిక్షణ తరగతులు నేటితో ముగియనున్నాయి.