'జైరాం... ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పు'
హైదరాబాద్: దేశం అభివృద్ధి చెందకూడదు... ప్రధాని నరేంద్రమోదీకి పేరు రాకుడదన్నది కాంగ్రెస్ విధానమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం హైదరాబాద్లో ఆరోపించారు. రాజకీయం కోసమే భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. అవసరమైతే ప్రజలల్లోకి వెళ్లి భూసేకరణ చట్టాన్ని వివరిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాత మోదీ ఆకర్షణ మరింత పెరిగిందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నాయని వెంకయ్య అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ఆయన కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముందు ఈ విషయంపై వెంటనే సమాధానం ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జైరాం రమేష్ను సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఇటీవల హైదరాబాద్లో జైరాం రమేష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు... జైరాంకు సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 46 బిల్లులు పాస్ చేసిన సంగతి గుర్తు చేశారు.