తెలుగు రాష్ట్రాలను మర్చిపోను: వెంకయ్య
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాధాన్యత ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చట్టసభలు చర్చలకు వేదిక కావాలే కానీ, ఘర్షణలకు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..‘ఉప రాష్ట్రపతి బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తా. రాజ్యసభకు పునర్ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు చాలా ప్రాధాన్యత ఉంది. అర్థవంతమైన చర్చతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి.
పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషి చేయాలి. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ప్రభుత్వంపైనా ప్రతిపక్షం కూడా సద్విమర్శలు చచేయాలి. వ్యక్తిగత ద్వేషాలు రాజకీయాల్లో ఉండకూడదు. నేడు చట్టసభల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. స‍్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిద్దాం.
నాకున్న బలం,బలహీనత అదే..
నాకున్న బలం, బలహీనత ఒక్కటే. అది జనంతో మమేకం కావడం. నాకు ఎప్పుడూ జనం...జనం కావాలి. 2020 జనవరి నుంచి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నా. ఆ తర్వాత సమాజ సేవలో పాల్గొంటా. ఇదే విషయాన్ని మా ఆవిడకు కూడా ముందే చెప్పేశాను. ఏదైనా అనుకుంటే పట్టుదలతో ఆ పని చేసేవాడిని. అధిక సమయం కేటాయించి ఎక్కువగా శ్రమించేవాడిని. దేశంలోని 623 జిల్లాలు పర్యటించాను. అనేక పార్టీలను, ప్రభుత్వాలు చూశాను. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఈ స్థాయి వరకూ వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలను మర్చిపోను. నా స్థాయి వరకూ సాయం చేసేందుకు ప్రయత్నిస్తా.
రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. అయితే ఇంత తక్కువ సమయంలో ఎక్కువ సహాయం జరిగింది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే. అది ప్రజలకు రావాల్సిన న్యాయమైన వాటా. ఈ విషయంలో అప్పడప్పుడు నాపై విమర్శలు వచ్చాయి. వెంకయ్య నాయుడు ఏపీపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని. ఏపీ కూడా దేశంలోనే ఉంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారు. ఏపీకి ఏమైంది వెంకయ్య నాయుడు ఉన్నారు కదా అని. అన్యాయం జరిగింది కాబట్టే న్యాయం జరిగే ప్రయత్నం చేయాలి. రోడ్ల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుంది.