
గుంటూరు: ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు శనివారం జిల్లాకు వస్తున్నారు. ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 8.30 గంటలకు పెదనందిపాడు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.30 గంటలకు బయల్దేరి పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 10.15 గంటలకు బయల్దేరి గుంటూరులోని ఓమెగా హాస్పటల్‌కు 10.45 గంటలకు చేరుకుంటారు. 11 నుంచి 11.45 గంటల వరకు అదే ఆసుపత్రిలో అంకాలజీ విభాగం, 150 పడకల సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 12 నుంచి 1.15 గంటల వరకు జేకేసీ కళాశాల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 1.15 నుంచి 2.15 గంటల వరకు భోజన విరామం. 2.15 గంటలకు జేకేసీ కళాశాల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.30 గంటలకు ఒమెగా హాస్పటల్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 గంటలకు తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.30 గంటలకు ఒమెగా ఆసుపత్రిలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలసి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి ఉపరాష్ట్రపతి ఒమెగా హాస్పటల్ వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి బయల్దేరి వెళ్లిన అనంతరం 2.35 గంటలకు తిరిగి నివాసానికి చేరుకుంటారు.
భారీ బందోబస్తు
వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా అర్బన్ ఎస్పీ విజయరావు శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. పలు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జేకేసీ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తుతోపాటు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి అటువైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. రాష్ట్రపతితోపాటు ముఖ్యమంత్రి కూడా వస్తున్న నేపథ్యంలో ఒమెగా హాస్పటల్ సమీపంలో రెండు హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. ఎస్పీ, డీఎస్పీలతో ఆ ప్రాంతంలో నిఘాను పెంచారు.
450మంది అధికారులు, సిబ్బంది కేటాయింపు
గుంటూరు: పెదనందిపాడులో శనివారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు వెల్లడించారు. జాబ్లీ వేడుకలు జరిగే కళాశాల ప్రాంగణంలో బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనఖీలు చేశామన్నారు. హెలీపాడ్ వద్ద ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి సిబ్బంది పహారా కాస్తున్నారని తెలిపారు. పెదనందిపాడు చేరుకున్న 450 మంది అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. వీవీఐపీ, వీఐపీల రాకపోకలకు ఆటంకం కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామాన్ని పోలీసు బలగాలు అధీనంలోకి తీసుకొని నిఘా కొనసాగిస్తున్నారని వివరించారు.
కాన్వాయ్ ట్రయల్ రన్
పెదనందిపాడు: వెంకయ్యనాయుడు పెదనందిపాడు రానున్న సందర్భంగా శుక్రవారం ఉదయం నాగులపాడులోని హెలిప్యాడ్ నుంచి పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల సభా ప్రాంగణం వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ సీహెచ్. వెంకట అప్పలనాయుడు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రధాన రహదారుల్లో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను డైవర్షన్ చేశామని, సభ ముగియగానే యథావిధిగా పునరుద్ధస్తామని ఆయన తెలిపారు.
తప్పిన ప్రమాదం
అబ్బినేనిగుంటపాలెం(పెదనందిపాడు): మండల పరిధిలోని అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి కాన్వాయ్ వచ్చే సరికి రోడ్డు మీద గొర్రెలు అడ్డు రావడంతో సడన్‌గా అపాల్సి వచ్చింది. ఆ సమయంలో కాన్వాయ్ వెనుక వస్తున్న కళాశాల అధ్యక్షుడు, రిటైర్డు ఏఏస్పీ కాళహస్తి సత్యనారాయణ కారు కాన్వాయ్ కారుల్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏఏస్పీ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. కారులోని వారు క్షేమంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment