- వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు
- ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ వస్తే రుణాల రీషెడ్యూల్
- సంక్షేమ పథకాలకు ‘ఆధార్’చేయాలని ఆదేశం
విశాఖపట్నం : ఉపాధ్యాయులను నియమించేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఆలస్యమవుతుందని, అవసరమైనచోట విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు రీషెడ్యూల్ చేసేందుకు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అందాల్సి ఉందని, అవి అందిన వెంటనే దీనిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, నీరు-చెట్టు, ఎస్‌హెచ్‌జీలకు ఇసుక విక్రయాల అప్పగింత, విజన్ డాక్యుమెంటరీ తదితర అంశాలపై చర్చించారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. వాణిజ్య పంటల సాగుతో పాటు ఉద్యానాలు, పశుసంవర్థకం, పుట్టగొడుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌డాంలు, వాటర్‌షెడ్‌లు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం కార్యక్రమాలు పటిష్టం చేయాలన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్-2029ను త్వరలో రూపొందించనున్నట్టు సీఎం తెలిపారు. దీనికోసం ఏడు మిషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
పంచాయతీలకు రూ. 342 కోట్లు...
రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 342 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఆ నిధులతో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో మంత్రి అయ్యన్న, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు పాల్గొ న్నారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎంవీ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, అదనపు కమిషనర్ ఎం.జానకి, అదనపు సంయుక్త కలెక్టర్ వై.నర్సింహారావు, జెడ్‌పీ సీఈవో మహేశ్వర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్, జిల్లా వైద్యశాఖాధికారిణి డాక్టర్ రెడ్డి శ్యామల, జిల్లా మలేరియాఅధికారి ప్రసాదరావు, తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.