- ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ
- టెక్నో పేరిట వేలకు వేలు వసూళ్లు
- విలవిల్లాడుతున్న మధ్య తరగతి తల్లిదండ్రులు
- కానరాని ప్రభుత్వ నియంత్రణ
నక్కపల్లి: పేద మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశలను ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుం టున్నాయి. పుస్తకాలు, ఫీజుల పేరుతో వేలకు వేలు గుంజుతున్నాయి. ఎల్‌కేజీ విద్యార్థుల పుస్తకాల కోసం రూ.2 వేలు, ఫీజుల నిమిత్తం రూ.20 వేలు, బస్సు చార్జీల రూపేణా మరో రూ.6 వేలు, ప్రాజె క్టు పనుల కోసం మరో రూ.2 వేలు... ఇలా వేలకు వేలు గుంజుతున్నా పట్టించుకున్న నాధుడే లేడని మధ్య తరగతి వర్గాలు వాపోతున్నాయి.
మా దగ్గరే కొనాలి పాయకరావుపేట, తుని పట్టణాల్లోని ప్రధాన కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులు, విక్రయించే పుస్తకాల ధరలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. యాజమాన్యాలే టెక్నో పేరుతో సిలబస్ తయారు చేసి వాటి పుస్తకాలను తమవద్దే కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, నోట్ పుస్తకాలు, ఎక్జామ్ ప్యాడ్స్, డైరీ, ఫైళ్లు పేరుతో ప్యాకేజీ నిర్ణయించి వేలాది రూపాయలు గుంజుతున్నారు. పాఠ్యపుస్తకాలు, స్టడీమెటీరియల్ పాఠశాలలో, నోట్ పుస్తకాలను బయట కొనుక్కుంటామంటే యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు.
పాయకరావుపేట పట్టణంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థ పాఠ్య పుస్తకాల కోసం ఎల్‌కేజీకి రూ.1907, యూకేజీకి రూ.2268, ఒకటో తరగతికి రూ.3047 వసూలు చేస్తోంది. అయిదో తరగతి విద్యార్థికి రూ.4200 పైనే అవుతోంది. ఎనిమిదో తరగతి విద్యార్థికి రూ.3830, తొమ్మిదో తరగతి విద్యార్థికి రూ.3900 వసూలు చేసి పుస్తకాలను సరఫరా చేస్తున్నారు.
ఫీజుల రూపేణా ఎల్‌కేజీ విద్యార్థికి రూ.15000, బస్సు చార్జీలుగా కిలోమీటర్ల బట్టి రూ.4 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. అయిదో తరగతి, ఆపై చదివే విద్యార్థులకు రూ.19 వేల నుంచి రూ.23 వేల వరకు, బస్సు చార్జీల కింద రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవిగాక ప్రాజెక్టుల కోసం ఏడాదికి మరో రూ.3 వేల నుంచి రూ.4 వేలు దండుకుంటారు.
ఈ పాఠశాలలో అయిదో తరగతి విద్యార్థి చదవాలంటే ఏటా రూ.35 వేలు ఖర్చవుతుంది. ప్రయివేటు యాజమాన్యాల వసూళ్లను అరికట్టడంపై విద్యాశాఖ దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరు తున్నారు.