బల్లిపర్రు బాలికల హాస్టల్‌పై విజి‘లెన్స్‌’ | Vigilance Attacks On Girls Hostel Krishna | Sakshi
Sakshi News home page

బల్లిపర్రు బాలికల హాస్టల్‌పై విజి‘లెన్స్‌’

Published Thu, Jul 26 2018 1:37 PM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

Vigilance Attacks On Girls Hostel Krishna - Sakshi

వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీసీ యానాది. పక్కన విజిలెన్స్‌ సీఐ అపర్ణ, చెన్నయ్య తదితరులు

పెడన మండలం బల్లిపర్రులోని బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖాలు చేశారు. అయితే, తనిఖీల సమయంలో సహకరించకపోతే వంట సిబ్బంది విజిలెన్స్‌ అధికారులకు ఎదురుతిరిగారు. ఏకవచనంతో సంభోదిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులతోపాటు టీచర్లు కూడా అవాక్కయ్యారు.

పెడన : విజయవాడకు చెందిన విజిలెన్స్‌ సీఐ అపర్ణ, డీసీటీవో డి. చెన్నయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ అన్సారీ బుధవారం మధ్యాహ్నం బల్లిపర్రు గురుకుల పాఠశాల (హాస్టల్‌) తనిఖీకి వచ్చారు. భోజన సమయానికి వచ్చిన వీరు డైనింగ్‌ హాల్‌ను పరిశీలించారు. తనిఖీల సమయంలో అక్కడ పని చేస్తున్న టీచర్లు, సిబ్బంది నుంచి ఫోన్లు తీసేసుకున్నారు. పెరుగు ఎంత ఉందనే దానిపై కాటా వేస్తుండగా వంట సిబ్బందిలో పని చేస్తున్న రూబెన్‌ అనే పెళ్లి కాని యువకుడు విజిలెన్స్‌ అధికారులకు ఎదురుతిరిగాడు. తన ఫోన్‌ ఇవ్వాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. కాంట్రాక్టరు తల్లి జయమ్మ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండటంతో అక్కడే ఉన్న టీచర్లు వారిస్తున్నా వినిపించుకోలేదు. గట్టిగట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. ‘మీకు ఎందుకు సమాధానం చెప్పాలి.. మా కాంట్రాక్టు రద్దయినా పని చేస్తున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి..’ అని సమాధానం చెప్పడంతో విజిలెన్స్‌ సీఐ అపర్ణ వెంటనే గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పి. యానాదికి ఫోన్‌లో పరిస్థితిని వివరించి తక్షణం రావాల్సిందిగా కోరారు.

డార్మెటరీ అధ్వానం...బాత్రూమ్‌లు అపరిశుభ్రం
విద్యార్థినులు పడుకునే గదులున్న డార్మెటరీ అధ్వానంగా ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వాడకం నీరు లేకపోవడం, పై అంతస్తుల్లోని బాత్రూమ్‌ల వద్ద నీరు లీకై కారుతుండటం వంటి వాటిని ఫొటోలు తీసుకుని నివేదికలు రూపొందించారు. విద్యార్థినులకు సరిపడ గదులు లేవని నమోదు చేసుకున్నారు. బాత్రూమ్‌ల వద్ద అపరిశుభ్రత వాతావరణంపై సీఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులు, విద్యార్థినులుండే గదులు బూజుపట్టి ఉండటంపై టీచర్లను ప్రశ్నించారు.

ఇష్టానుసారంగా రికార్డుల్లో నమోదు..
అధికారులు అటెండెన్స్‌ రిజిస్టర్లతో పాటు పలు రికార్డులను కూడా పరిశీలించారు. ఉన్నతాధికారులు రిలీవ్‌ చేయకుండా, ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఈ నెల 21న ప్రిన్సిపల్‌ ఎన్‌వీ రమణమ్మ రిలీవ్‌ అయిపోతున్నట్లు అటెండెన్స్‌ రిజిస్టరులో సంతకం చేసి వెళ్లిపోయారు. అనంతరం 22న మూమెంట్‌ రిజిస్టరులో టీచర్లకు సూచనలు, సలహాలు చేసినట్లు ప్రిన్సిపల్‌ రమణమ్మ నమోదు చేసి ఉండటాన్ని గుర్తించారు. 24వ తేదీన సర్క్యులర్‌ రిజిస్టరులో జి భ్రమరాంబకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించినట్లు నమోదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఈ విధంగా రికార్డుల్లో రాయడం వంటి విషయాలను నమోదు చేసుకున్నారు.

కుకింగ్‌ ఏజెన్సీ రద్దు..
గురుకుల పాఠశాలల (డీసీ) జిల్లా సమన్వయకర్త పి. యానాది, బదిలీపై వెళ్లిన ప్రిన్సిపల్‌ రమణమ్మ బుధవారం సాయంత్రం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. వంట సిబ్బంది ఎదురుతిరిగిన సంఘటనలను సెల్‌ఫోన్‌ ద్వారా రికార్డు చేసి డీసీకి చూపించారు. ఆయన వంట ఏజెన్సీ కాంట్రాక్టరును పిలిచి చీవాట్లు పెట్టారు. విజిలెన్స్‌ సీఐ అపర్ణ మాట్లాడుతూ స్థానికంగా పని చేస్తున్న టీచర్ల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండటంపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. టీచర్లంటే కూడా భయం లేకుండా సిబ్బంది ప్రవర్తించడం వంటివి భవిష్యత్‌కు మంచి పరిణామం కాదని స్పష్టం చేశారు. డీసీ యానాది స్పందిస్తూ తక్షణం కుకింగ్‌ ఏజన్సీని రద్దు చేసి మరొకరికి అప్పగించాలని సిబ్బందిని ఆదేశించడమే కాకుండా ఉత్తర్వులను రెడీ  చేయాలని సూచించారు. విద్యార్థినులుండే చోట పెళ్లికాని యువకుడు ఏడాది నుంచి పని చేస్తుంటే పట్టించుకోకపోవడంపై సీఐ వారిని ప్రశ్నించారు. అనంతరం పలు విషయాలను నమోదు చేసుకున్న అనంతరం విజిలెన్స్‌ అధికారులు వెనుదిరిగారు.

సౌజన్యకు ఇన్‌చార్జి బాధ్యతలు..
గురుకుల పాఠశాలలో ఇటీవల బదిలీపై వచ్చిన బయాలజీ టీచరు ఎం. సౌజన్యకు ఇన్‌చార్జి బాధ్యతలను డీసీ యానాది అప్పగించారు. పది రోజులు ఇన్‌చార్జిగా వ్యవహరించాలని, అనంతరం జిల్లాలో సీనియర్‌ను తీసుకువచ్చి రెగ్యులర్‌ ప్రిన్సిపల్‌గా నియమిస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement