బందరు మున్సిపల్ కార్యాలయం
రికార్డుల తనిఖీలకు వచ్చిన విజిలెన్స్ అధికారులకు ఎవరైనా ఏం చేస్తారు.. రికార్డులు చూపించి సహకరిస్తారు. కానీ బందరు మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రికార్డులు చూపించడం సంగతి అటుంచితే.. కనీసం తలుపులు కూడా తీయలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ ఒక్క వ్యవహారం చాలు ఆశాఖలో ఏ మేరకు అవినీతి రాజ్యమేలుతోందో తెలిపేందుకు అని పరిశీలకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాక్షి, మచిలీపట్నం: 2016–17 ఆర్థిక సంవత్సరంలో బందరులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకంలో జోన్–2 పరిధిలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. రూ.5 కోట్లు వెచ్చించి చేపట్టిన పనుల్లో నిబంధనలు తోసిరాజని, ధనార్జనే ధ్యేయంగా ముందుకు కదిలారు. నాసిరకం నిర్మాణాలతో రూ.లక్షలు దిగమించారు. ఈ అక్రమ తంతుపై ఇటీవల ‘నిధులు గుల్ల.. పనులు డొల్ల.’ అనే శీర్షికతో ఈనెల 24 ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దోపిడీ పర్వంపై విశ్లేషణతో కూడిన కథనానికి విజిలెన్స్ అధికారులు స్పందించారు. ఈ అక్రమ బాగోతం గుట్టురట్టు చేసేందుకు రికార్డులు తనిఖీ నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగానే మంగళవారం బందరు మున్సిపల్ కార్యాయానికి వెళ్లారు.
ముఖం మీదే తలుపేశారు..
ఇప్పటికే బాక్స్ టెండర్ల అంశంలో అవినీతిని మూటగట్టుకున్న విషయం తెలిసింది. తాజాగా ‘సాక్షి’ కథనం సైతం కలకలం రేపింది. ఇదే సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమ తంతుపై కథనం ప్రచురితం కావడంతో విజిలెన్స్ అధికారులు నిజాలు నిగ్గుతేల్చేందుకు మంగళవారం మచిలీపట్నంలోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పాలకవర్గం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రస్తుతం అధికారులకు సహకరించి రికార్డులు సమర్పిస్తే తమ బండారం బయట పడుతుందని భావించారు. ఎలాగైనా తప్పించుకునేందుకు ఎత్తుగడ వేశారు. అప్పుడే ఓ ఉపాయానికి తెర తీశారు. ఎలాగో వైఎస్సార్ సీపీ బంద్ కొనసాగుతోందని, బంద్ ముసుగులో మస్కా కొట్టాలని తలంచారు. అనుకున్నదే తడువుగా వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు. ఇందులోనే మున్సిపల్ అధికారులు రెవెన్యూ సెక్షన్‌కు చేరుకున్నారు. అక్కడే అసలు కథ ప్రారంభమైంది. అక్కడికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు తలుపు వద్దకు వెళ్లగా ఒక్కసారిగా మూసేశారు. అదేమని ప్రశ్నించగా.. ఈ రోజు రాష్ట్ర బంద్ కొనసాగుతోందని, ప్రస్తుతం కార్యాలయం తెరిస్తే.. ఆందోళన కారులు కార్యాలయంలోకి ప్రవేశిస్తే నష్టం జరుగుతుందని, అందుకే తలుపులు మూసేస్తున్నామని నమ్మబలికారు. బంద్ అనంతరం బుధవారం వస్తే మీకు సహకరిస్తామని చెప్పినట్లు సమచారం. తాము విజిలెన్స్ అధికారులమని చెప్పినా పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఉదయం వచ్చిన విజిలెన్స్ అధికారులు గంటలకొద్దీ అక్కడే కూర్చున్నా లాభం లేకుండా పోయింది. ఎంతకూ ఏ ఒక్క అధికారి సైతం సహకరించకపోవడంతో చేసేది లేక వెనుదిరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కనీసం అధికారులకు సహకరించలేదంటే మున్సిపాలిటీలో ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. విజిలెన్స్ అధికారులకు సహకరించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేనున్నప్పుడు వస్తామన్నారు
బందరు మున్సిపల్ కార్యాలయానికి మంగళవారం విజిలెన్స్ అధికారులు వచ్చిన మాట వాస్తవమే. అయితే బంద్ కావడంతో ఆ రోజు నేనే విధులకు హాజరు కాలేదు. నేను కార్యాలయంలో ఉన్న రోజు వస్తామని మా సిబ్బందితో చెప్పి వారు వెళ్లిపోయారు. – సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment