ప్రత్తిపాడు: మండలంలోని వివిధ గ్రామాల్లోని నిత్యావసర వస్తువుల దుకాణాలు(రేషన్ షాపు)పై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. 361.10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈదాడులు నిర్వహించినట్టు విజిలెన్స్ సీఐలు టి.రామ్మోహన్ రెడ్డి, సాయి రమేష్, సత్య కష్ణ ప్రత్తిపాడులో గురువారం సాయంత్రం తెలిపారు. మండలంలోని ఏలూరులో రెండు, పెద్దిపాలెంలో రెండు, ప్రత్తిపాడు, ఉత్తరకంచి గ్రామాల్లోని ఒక్కొక్క రేషన్ షాపు వెరసి ఆరు షాపులపై దాడులు నిర్వహించారు.
ఏలూరు షాపు నంబర్–6లో 12 క్వింటాళ్లు, షాపు నంబర్ 38లో మూడు క్వింటాళ్లు, పెద్దిపాలెం షాపు నంబర్ 15లో 11 క్వింటాళ్లు, షాపు నంబర్ 16లో మూడు క్వింటాళ్లు, ప్రత్తిపాడు షాపు నంబర్ 11లో ఐదు క్వింటాళ్లు, ఉత్తరకంచి షాపు నంబర్ 28లో మూడు క్వింటాళ్లు వెరసి 37 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. బియ్యం నిల్వలు తేడాగా ఉండడంతో ఈ ఆరు షాపుల్లో ఉన్న 361.10 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు ఏలూరులో 26 కేజీలు, పెద్దిపాలెంలో 39 కేజీలు, ప్రత్తిపాడులో 14 కేజీలు, ఉత్తరకంచిలో 12 కేజీలు వెరసి 91 కేజీల పంచదారను కనుగొన్నారు.
డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐలు తెలిపారు. జేసీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, డీసీటీఓ రత్నాకర్, ఏజీఓ మహేష్, ఎస్సై రామకష్ణ, ప్రత్తిపాడు ఎంఎస్‌ఓ ఎస్‌కే ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment