అనంతపురం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ అనిల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ అనిల్‌పై బదిలీ వేటు పడింది. అనంతపురం నుంచి బదిలీ చేయడమే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులు ఆ శాఖ నుంచి రిలీవ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా నియమిస్తూ, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీ స్థాయిలోని అనిల్‌ను విజిలెన్స్ ఎస్పీగా నాలుగేళ్లకుపైగా ఎఫ్‌ఏసీ(పూర్తి అదనపు బాధ్యతలు)పై విధులు నిర్వహించారు. అయితే ఆయన పనితీరుపై విపక్షపార్టీ తరచూ విమర్శలు గుప్పించింది.
అధికారపార్టీకి పూర్తి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, పలు శాఖలను బ్లాక్‌మెయిల్ చేసి అవినీతికి పాల్పడుతున్నారని డీజీకి ఫిర్యాదు చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా అనిల్ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 3న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజిలెన్స్ డీజీకి ఫిర్యాదు చేశారు.విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ జిల్లాపై నిఘా ఉంచి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం వెచ్చించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. అలా జరిగితే తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలి. కానీ ఈ శాఖ పనితీరు నాలుగేళ్లుగా వివాదాస్పదంగానే ఉంది. అనిల్ అధికార పార్టీకి అండగా ఉంటారని, ఓ సామాజికవర్గానికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి తనిఖీల పేరుతో బెదిరించి ఒకసారి కేసు నమోదు చేసి, తర్వాత వారితో సత్ససంబంధాలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపించా యి.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందనికాడికి దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసే స్థాయికి వచ్చారంటే ఆ శాఖ పరిస్థితి ఎలా ఉందో? అధికారులు ఎలా వ్యవహరించారో? ఇట్టే తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీలోని ఓ కీలక అధికారి, విజిలెన్స్‌లో పనిచేసిన ఓ ఎస్‌ఐ అండతో ఇతను అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు అనిల్‌పై బదిలీ వేటు వేశారని తెలుస్తోంది.
అనిల్‌పై వచ్చిన ఆరోపణలు కొన్ని:
= సాయినగర్ పశువుల ఆస్పత్రిలో అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నిధులు(బిల్లు నెంబర్–3160/29–3–2014,ఎంబుక్కు నెంబర్ 454/2012–2013)తో షెడ్డు నిర్మించారు. దీనికి ప్రస్తుత కార్పొరేషన్ అధికారులు 2014 అక్టోబర్ 29న మరో బిల్లు(బిల్లునెంబర్1648/29–10–2014, ఎంబుక్కు నెంబర్ 24/2008–09)డ్రా చే శారు. దీన్ని 2008–09 ఎంబుక్కులో ఎంటర్ చే శారు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు.
= తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా దందా ఏ స్థాయిలో సాగుతోందో పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని ఆ శాఖ విజిలెన్స్ సీఐ ప్రతాప్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫి ర్యాదుచేశారు. తాడిపత్రితో జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ దందా సాగుతున్నా విజిలెన్స్ నిఘా కరువైంది. వారితో విజిలెన్స్ అధికారులు సన్ని హిత సంబంధాలు నడపడమేననే ఆరోపణలు ఉన్నాయి.
=ఎరువుల దుకాణాల్లోని అవకతవకలు చూసీ చూడనట్లు వ్యవహరించేందుకు వ్యాపారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసినట్లు తెలుస్తోంది.
=కర్ణాటక నుంచి ప్రతి నెలా 80–100 వరకూ స్పాంజ్ ఐరన్ లారీలు హిందూపురం పరిధిలోని పరి శ్రమలకు వస్తుంటాయి. ఒక్కో వాహనానికి రూ.15వేలు ఇవ్వాలని హుకూం జారీ చేసినట్లు సమాచారం.
= జిల్లాలో క్రషర్లతో పాటు మైనింగ్ 75శాతం ని బంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. వీరి నుం చి కూడా భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
= గుంతకల్లు సమీపంలోని కొందరు డీజిల్ మాఫియాగా ఏర్పడి కల్తీ ఆయిల్ సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
= ఓ సిమెంట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ నిబంధనలకు వి రుద్ధంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నందుకు ప్రతి నెలా రూ.2లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
= ఇసుక మాఫియా నుంచి కూడా భారీగా ముడుపులు అందుతున్నట్లు తెలిసింది.
= తనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ల జోలి కి వెళ్లకుండా ఉండటం, విపక్ష పార్టీకి చెందిన ఏజెన్సీలు, దారికి రాని వారి పనుల్లో లోపాలు వెతికి కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించేలా చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
=అనంతపురంలోని ఒకటో డివిజన్‌లో సిమెంట్ రోడ్డు తనిఖీకి వెళ్లి ఒక శాంపిల్ తీయగానే అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ రావడంతో వెనక్కు వెళ్లిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment