ఢిల్లీ: సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంచార, విముక్త జాతులను ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలని బుధవారం ఆయన రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. సమసమాజ స్థాపన లక్ష్యంగా అణగారిన వర్గాల ప్రజలు దౌర్జన్యాలు, దుర్మార్గాల పాలిట పడకుండా మన రాజ్యాంగ నిర్మాతలు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని గుర్తు చేశారు. సమాజంలో అణచివేతకు, నిరాదరణకు గురయ్యే వర్గాల ప్రజలను అత్యాచారాలు, దౌర్జన్యాల నుంచి కాపాడటం ఈ చట్టం ఉద్దేశమని ఆయన చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చి మిగిలిన సంచార, విముక్త జాతులను విస్మరించడం దురదృష్టకరమని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సమాజంలో ఈనాటికీ సంచార ఇతర విముక్త జాతుల ప్రజలు దయనీయమైన జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వారు తరచుగా దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నారని గుర్తుచేశారు. అత్యాచార నిరోధక చట్టం కింద ఉన్న ఎస్సీ, ఎస్టీల కంటే.. వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పారు. ఈ జాతులకు చెందిన ప్రజలను దోపిడీ, దౌర్జన్యాల నుంచి కాపాడటానికి ఇప్పుడు దృఢ నిశ్చయంతో చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంచార, విముక్త జాతులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment