
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ సంస్థను సీజ్ చేయటానికి విజయ బ్యాంకు అధికారులు రావడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ ఏలూరు మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అంబికా కృష్ణకు చెందిన అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ కంపెనీ చెన్నైలోని విజయా బ్యాంకుకు భారీగా బకాయి పడ్డారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లింపులు చేయకపోవడంతో చెన్నై విజయా బ్యాంకు అదనపు జీఎం రాధాకృష్ణ నేతృత్వంలోని బ్యాంకు అధికారుల బృందం ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి ఏలూరు వచ్చారు. బకాయిలపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపి రేపటి వరకు గడువు ఇచ్చారు. ఈనెల 18వ తేదీలోపు బకాయిలు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు జప్తు ఆలోచనను తాత్కాలికంగా విరమించుకుని బ్యాంకు అధికారులు వెనుదిరిగారు.
అంబికా గ్రూపు సంస్థలను అంబికా కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. విజయా బ్యాంకుకు అంబికా సంస్ధలు దాదాపుగా రూ. 28 కోట్ల వరకు బకాయిలు పడ్డట్టు సమాచారం. బకాయిల వ్యవహారంపై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు.